న్యూఢిల్లీ, జనవరి 19: ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను మోదీ సర్కార్ వచ్చే నెల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పద్దును ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం తరహాలో కస్టమ్స్ సుంకాల నిర్మాణాన్ని సరళతరం చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
కస్టమ్స్ డ్యూటీ రేట్లను హేతుబద్ధం చేయడంతోపాటు శ్లాబులను కుదించడం, ఎగుమతి-దిగుమతుల కోసం సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థను తీసుకురావడం వంటి నిర్ణయాలు ఈ బడ్జెట్లో ఉండాలని వారు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎగుమతి, దిగుమతుల క్లియరెన్స్ కోసం ఎగుమతిదారులు, దిగుమతిదారులు అనేక ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలను ఆశ్రయించాల్సి వస్తున్నదని డెలాయిట్ ఇండియా భాగస్వామి గుల్జార్ దిద్వానియా చెప్తున్నారు. ఇక లిటిగేషన్లను పరిష్కరించే దిశగా చర్యలుండాలని కూడా సూచిస్తున్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరగాలంటే బడ్జెట్లో తప్పక పన్ను చట్టాలను హేతుబద్ధం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రాస్-బార్డర్ రీఆర్గనైజేషన్స్లో తటస్థ పన్ను నిర్ధారణ కూడా ముఖ్యమేనని అంటున్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పన్ను సంబంధిత సమస్యలపైన దృష్టిపెట్టాలని శార్దుల్ అమర్చంద్ మంగళ్దాస్ అండ్ కో భాగస్వామి రుద్రకుమార్ పాండే అన్నారు. కాగా, ప్రధాన ముడి సరుకులపై కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ కీలకమని భారతీయ ఎరువుల సంఘం అంటున్నది.