ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
వేములవాడ అర్బన్ మండలం ఆర్ఆర్ చింతల్ఠాణా గ్రామానికి చెందిన మల్లవ్వ ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి పక్కింట్లోని బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లింది. మల్లవ్వ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
దుండగుడి దాడిలో మల్లవ్వ నోటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన సమయాన్ని దుండగుడు ముందుగానే గమనించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.