నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 20: నలభై రోజులైనా ధాన్యం కొంట లేరని, వర్షం వచ్చి పంట తడిస్తే ఎవరు బాధ్యులని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంటా ఎప్పుడు పెడ్తరో తెల్వక రైతులు నిత్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విసిగిపోయిన రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. అయినా ఈ సర్కార్ స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.
బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలకు దిగారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మళ్లపల్లి రైతులు కన్నెర్ర చేశారు. ధాన్యం బస్తాలను తగులబెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మందు డబ్బాతో హెచ్చరించారు. ఈ ప్రభుత్వం గారడీ మాటలతో మోసపోయి గోస పడుతున్నామని రైతు గౌరయ్య చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపాడు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాంటా వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం బోర్లగూడెంలో రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.
వారం రోజులుగా లారీలు రావడం లేదంటూ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. ఆగ్రహంతో చెన్నూరు నుంచి వేమనపల్లి గోదాముకు వచ్చిన సుమారు 20 లారీల వడ్లను అడ్డుకొని నిరసన తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ వచ్చి రైతులతో మాట్లాడి.. లారీలను పంపిస్తామని, జూన్ 10 వరకూ రైతుల నుంచి పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తొర్రూరు మండలం చింతలపల్లి కొనుగోలు కేంద్రంలో విద్యార్థులు హమాలీలుగా మారి ధాన్యం బస్తాలు మోశారు.
చింతలపల్లి బొత్తాలతండాకు చెందిన రైతు గుగులోతు రవీందర్ ధాన్యాన్ని నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. హమాలిల కొరతతో రైతు రవీందర్ కొడుకులు పదోతరగతి చదువుతున్న ప్రేమ్‌చంద్, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బుచ్చిరాం స్వయంగా ధాన్యం బస్తాలను బుధవారం ప్రైవేట్ వాహనంలో లోడ్ చేసి మిల్లుకు తరలించారు. కొనుగోళ్లు నత్తనడకన సాగడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, నర్సక్కపేట, జవారిపేట, కందికట్కూర్ గ్రామాలకు చెందిన సుమారు 200 మందికిపైగా రైతులు పొత్తూర్కు తరలివచ్చి ధర్నా చేశారు.
గన్నీ సంచుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద కామారెడ్డి-సిద్దిపేట రోడ్డుపై రైతు లు ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొం తాపూర్ రైతులు ధర్మపురి తహసీల్ కార్యాలయం ఎ దుట రహదారిపై బైఠాయించారు. క్వింటాల్‌కు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు.