Telangana Rains | ఖమ్మం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరుకు ముంపు వచ్చి మూడ్రోజులవుతున్నా మురుగును తొలగించేనాథుడే కరువయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న బాధితులకు పస్తులు తప్పడం లేదు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో బాధితుల కనీస అవసరాలను పట్టించుకోవట్లేదు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, వెంకటేశ్వరనగర్, మాణిక్యనగర్, మోతీనగర్, గణేష్‌నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతా ల్లో ఇండ్లన్నీ బురదమయంగా మారాయి. ఇండ్లలో బురదను శుభ్రం చేయడానికి కనీసం నీళ్లు కూడా సరఫరా చేయడం లేదు. కార్పొరేషన్ అధికారులు ట్యాంకర్లను ఏర్పా టు చేసినా సరిపడా అందుబాటులోలేక ఇబ్బంది పడుతున్నారు.
ఇంతవరకు విద్యుత్తును పునరుద్ధరించలేదు. విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు భూమిమీదనే వేలాడుతున్నవి. చీకట్లో పాములు, తేళ్లు ఇండ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల తడిసిన బియ్యంను రోడ్లమీదనే పోయడంతో వాసన వస్తున్నాయి. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నా కనీసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. లారీల కార్యాలయ ఆవరణలో సుమారు 200 లారీలు మునిగిపోగా, వీటి మరమ్మతులకు ఒక్కొక్క లారీకి సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుందని యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది.
నీళ్లు పోసినోడే లేడు..
వరదలు వచ్చి మా బతుకులు నీళ్లలోనే ఉన్నా మమ్ములను కాపాడేవాడే లేడు. మంచినీళ్లు పోసిన నాధుడే కరువయ్యాడు. ముగ్గురు మంత్రులు ఉన్నారంట.. వాళ్ల వల్ల ఏమీ ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కడు మాటలు చెప్పేటోడే తప్ప పేదల గురించి పట్టించుకునే లేడు. బురదను కడుక్కోవడానికి నీళ్లు కూడా లేవు. బట్టలను ఉతుక్కోవడానికి మళ్లీ మున్నేరుకే వెలుతున్నానయ్యా. మా బతుకులు ఇంతే.
-గాళ్ల ఉమ, బొక్కలగడ్డ, ఖమ్మం
బీఆర్ఎస్సే బాగుండే
ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే.. పువ్వాడ అజయ్కుమారే మంచి చేసిండు. పోయిన ఏడాది వరదలు వస్తే కేసీఆర్ చెప్పిండు.. అజయ్‌కుమార్ వచ్చిండు. వరదలోనే తిరిగిండు. మా కార్పొరేటర్ నాగేశ్వరరావు కూడా వరద నీళ్లలోనే మాతోనే ఉండి మమ్మల్ని ఆదుకుండు. ఇప్పుడు ఆయన ఇళ్లూ మునిగిపోయింది. అయినా వచ్చిండు అర్సుకుండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే చాలా బాగుండేది.
-రాజేశ్వరి, బొక్కలగడ్డ, ఖమ్మం
పేదోళ్లంటే లెక్కేలేదు
మూడు రోజులవుతున్నా నీళ్ల ట్యాంకర్ రాలేదు. ఇదేమిటని మున్సిపల్ వాళ్లను అడిగితే.. మెయిన్ రోడ్డుకే ట్యాంకర్ వస్తుందని చెబుతున్నారు. మా గల్లీకి ట్యాంకర్ రాదంట. అలాంటప్పుడు ఓట్ల కోసం మా దగ్గరకు ఎందుకు రావాలి. వచ్చేసారి ఎవడు వస్తాడో చూస్తాం. పేదోళ్లంటే ఒక్కడికి కూడా లెక్కలేదు. కేసీఆర్ పాలన ఉంటే బాగుండేది.
చలమల నాగేశ్వరరావు, మంచికంటి నగర్, ఖమ్మం
బియ్యం తడిసినయ్..
మున్నేరు వరదతో రాత్రిపూట మొదటి అంతస్తు కూడా మునిగిపోయింది. ఇంట్లో ఉన్న 8 క్వింటాళ్ల బియ్యం తడిసి ముద్దయ్యాయి. పాడైన బియ్యాన్ని మున్నేరులో పడేయడానికి ట్రాక్టర్ కావాలని మున్సిపాలిటీ వాళ్లను అడిగితే.. ట్రాక్టర్ పంపలేదు. ఆ బియ్యం ఇంట్లో ఉంటే పురుగులు పట్టి రోగాలు మాకే వస్తయి కదా.
ఎడ్లపల్లి తిరుపతమ్మ, మంచికంటి నగర్, ఖమ్మం
నిండా ముంచిన వాన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తెలంగాణ అతలాకుతులమైంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చొచ్చుకు రావడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పులు, దుస్తులు పనికిరాకుండా పోయాయి. కనీసం తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.