ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 4: విద్యను మించిన గొప్ప దానం మరొకటి లేదనేది ఆయన ప్రగాఢ నమ్మకం. విద్యను పదిమందికి పంచితే మరింత పెరుగుతుందే తప్ప ఎన్నటికీ తరగదనేది ఆయన విశ్వాసం. రేపటి పౌరులను తీర్చిదిద్దే ‘బడి’ ఎల్లప్పుడూ విద్యాకాంతులు వికసించాలనే సంకల్పం. ‘గురువు’గా తాను చదువు చెప్పిన సమయంలోనూ చదువులమ్మ ‘గుడి’ బాగుండేందుకు శక్తికొలదీ ఖర్చు చేస్తున్నారు. భారమైతే దాతలనూ ఆశ్రయించి సరస్వతీ ఆలయాన్ని సుందరంగా ఉంచడంలో కీలకంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఆయనలో అదే పట్టుదల. విరమణ ఉద్యోగానికేనని, తాను చేసే సేవలకు ఎన్నటికీ విరమణ ఉండదని చాటి చెబుతున్నారు. ఆయనే.. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ చుంచు సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత.. ప్రభుత్వ బడికి సేవలందిస్తున్న సత్యనారాయణ సేవలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తే వారిని ప్రోత్సహించేందుకు నగదు రూపంలో బహుమతులు అందజేస్తుంటారు. ఏటా ప్రతిభ కనబర్చిన వారిని అభినందిస్తుంటారు. చదువుతోపాటు క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంటారు. విద్యారంగ అభివృద్ధికి తనవంతుగా నిత్యం తోడ్పాటును అందిస్తుంటారు. చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంటారు. చదువే మనిషిని ప్రయోజకుడిగా చేస్తుందనేది సత్యనారాయణ అభిమతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయనున్న ‘మన ఊరు – మన బడి’తో సర్కార్ బడులకు సరికొత్త రూపు రానుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యాబోధనలోనూ మార్పు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవడం ద్వారా తమ బిడ్డలకు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టాలని తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. అభినందనీయమైనది. పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమం లేక విద్యలో వెనుకబడుతున్నారు. ఇక నుంచి ఈ సమస్యలకు చరమగీతం పాడినట్లే.
-చుంచు సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్
ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన చుంచు సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి ఉద్యోగం విరమణ పొందారు. ప్రభుత్వ బడులంటే ఆయన మక్కువ ఎక్కువ. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని నమ్మిన వ్యక్తి ఆయన. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల జీవన విధానాలు, సాంకేతిక మార్పులకు విద్య కీలకమంటారాయన.
1964లో అశ్వారావుపేటలో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం పొంది అనేక పాఠశాలల్లో ఉత్తమ సేవలను అందించారు. 1964 నుంచి 1970 వరకు అశ్వారావుపేట పాఠశాలలో, 1970 నుంచి 1976 వరకు దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 1976 నుంచి 1986 వరకు తిమ్మారావుపేట పాఠశాలలో, 1986- 1996 వరకు సుజాతనగర్ జడ్పీ హైస్కూల్లో పనిచేశారు. అయితే ఆయన టీచర్‌గా ఎక్కడ పని చేసినా అక్కడి బడి.. గుడిని తలపించాలనేది ఆయన తపన. అందుకు ఆయన తనకు వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి వెచ్చిస్తూ ఉండేవాడు. అంతేకాదు దాతలను ఆశ్రయించి పాఠశాల అభ్యున్నతి కోసం విరాళాలు సేకరించేవారు. ప్రస్తుతం ఆయనకు 83 ఏళ్లు వచ్చినప్పటికీ ప్రభుత్వ బడుల బాగును ఏమాత్రమూ మరువలేదు. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహారీ, గేట్లు అవసరమని తెలిసి వెంటనే కట్టించేందుకు ముందుకొచ్చారు.
ఖర్చెంతనే విషయంలో వెనుకాడకుండా సర్పంచ్, స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కబురు పెట్టారు. పనులు ప్రారంభించాలని సూచించారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్, మండల పరిషత్ స్కూళ్లకు ప్రహరీలు, ఆర్చీ, గేట్ల నిర్మాణానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించి గ్రామస్తుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలో సతీమణి శేషారత్నం, కుటుంబ సభ్యులు కూడా ‘మేముసైతం’ అంటూ భాగస్వాములయ్యారు. 2021 జూలైలో ప్రహరీ, ఆర్చీ, గేట్ల నిర్మాణానికి నగదు వితరణ చేయగా.. 2022 జనవరిలో నిర్మాణం పూర్తి చేసుకుని వినియోగంలోకి వచ్చింది.