Constable Stabbed : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సీసీఎస్ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ నిందితుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కత్తితో బలంగా ఛాతిలో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ (Pramod) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో మహాలక్ష్మి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
చోరీ కేసులో అతడిని కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఠాణాకు తరలిస్తుండగా.. వినాయక్‌నగర్ మెయిన్ రోడ్డుపైనే కానిస్టేబుల్‌పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచి పారిపోయాడు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.