కాళేశ్వరాన్ని కేసీఆర్ పూర్తి చేసి పాలమూరును నిర్లక్ష్యం చేసినారని, 27 వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వకుండా వదిలిపెట్టేశారని, ఒక్క ఎకరానికి నీరివ్వలేదని, కేసీఆర్ హయాంలోనే పాలమూరు డీపీఆర్ వాపస్ వచ్చిందని, ఒక్క అనుమతి కూడా రాలేదని ప్రభుత్వ పెద్దలు జనవరి 2న అసెంబ్లీలో అన్నమాటలు కదా! మక్కీకి మక్కీ ఇవే మాటలు జనవరి 6న బీజేపీ మేధావి వెదిరె శ్రీరాం కూడా అన్నారు. వ్యవహారం చూస్తే.. అందరూ కూడబలుక్కొని ఒకే మాట మాట్లాడుదాం అనుకున్నట్టుగా ఉన్నది. ఈ మాటలతో పాటూ పాలమూరు ప్రాజెక్టుకు హైడ్రాలజీ, పర్యావరణ అనుమతులు రాలేదని కూడా అన్నారు. హైడ్రాలజీ అనుమతి రాని మాట నిజమే. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సలహా కమిటీ (EAC) ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వవచ్చునని సిఫారసు చేసిన సంగతిని మాత్రం మరుగున పెట్టారు ఈ అపర మేధావి.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కథ ఉమ్మడి రాష్ట్రంలో 2009లోనే మొదలయ్యింది. తెలంగాణా విశ్రాంత ఇంజినీర్ల సంఘం తయారుచేసిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాథమిక నివేదికను శాసనసభ ఎన్నికలకు రెండు నెలల ముందు ఆనాటి మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యుడు విఠల్‌రావు గారి సారథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు 4.2.2009న అందజేయడం జరిగింది. ఆ నివేదికపై ‘pl.Investigate’ అని వైఎస్సార్ స్వయంగా రాసి సంతకం చేసినారు. ఆ లేఖను సీఎం కార్యాలయం అదేరోజు సాగునీటి శాఖ కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌కి పంపించింది. ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాని పాలమూరు దస్త్రం గతి ఏమయ్యిందో పట్టించుకున్నవారు లేరు. ఐదేండ్ల తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రాజెక్టు సర్వే కోసం జీవో నెంబరు 72ను 8.8.2013న జారీ చేసింది. జీవో అయితే జారీ అయ్యింది కానీ పని మాత్రం మొదలు కాలేదు. దస్త్రం మళ్ళీ అటకెక్కింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం చేసిన మొదటి పని… ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయి అటకమీద దుమ్ము పేరుకుపోయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు దస్ర్తాన్ని కిందకు దించి, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ వారి అధీనంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI- ఎస్కీ) వారిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించడానికి రూ.5.71 కోట్లను మంజూరు చేస్తూ జీవో నంబరు 69ని తేదీ 1.8.2014న జారీచేసింది. ఆనాటికి కాళేశ్వరం ఇంకా రంగంలోకి రానేలేదు. అంటే కాళేశ్వరం కంటే ముందే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం.
మూడునెలల తర్వాత అక్టోబర్ 2014లో ఎస్కీ వారు తయారుచేసిన ముసాయిదా నివేదికలోని ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు, సాగునీటి శాఖ సీనియర్ ఇంజనీర్లు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు, ఎస్కీ ఇంజనీర్లతో, సాగునీటి మంత్రి తన్నీరు హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గార్ల సమక్షంలో కూలంకషంగా సమీక్ష జరిగింది. ఇందులో జూరాల జలాశయం నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, దారిపొడుగునా గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రతిపాదించారు.
జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి నిల్వ చేసేందుకు ప్రతిపాదించిన మూడు జలాశయాల్లో.. కోయిల్‌కొండ (76 టీఎంసీ), గండీడ్ (35 టీఎంసీ), లక్ష్మీదేవిపల్లి (10 టీఎంసీ) – భారీ ముంపు ఉన్నట్టు గుర్తించారు. ఈ మూడు జలాశయాల్లో మొత్తం 47 గ్రామాలు,16,342 ఇండ్లు, 80 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతాయి. 84,444 జనాభా నిర్వాసితులు అవుతారు. కఠినమైన పర్యావరణ చట్టాలు, భూసేకరణ, పునరావాస చట్టాలు అమల్లో ఉన్నఈ కాలంలో ఇంత భారీ ముంపుతో ప్రాజెక్టు నిర్మించడం కష్టసాధ్యమని, ఈ భారీ ముంపును గణనీయంగా తగ్గించాలని సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తం అయ్యింది.
నీటిని ఎత్తిపోసే జూరాల సోర్సుపై కూడా సమావేశంలో విస్తృతమైన చర్చ జరిగింది. జూరాల అప్పటికే ఒక లక్ష ఎకరాల స్వంత ఆయకట్టుతో పాటు 2 లక్షల ఎకరాల నెట్టెంపాడు ఆయకట్టుకు, 2 లక్షల ఎకరాల భీమా ఆయకట్టుకు, 38 వేల ఎకరాల కోయిల్‌సాగర్ ఆయకట్టుకు, మహబూబ్‌నగర్ తదితర పట్టణాలకు, గ్రామాలకు, తాగునీరు అందించే భారాన్ని మోస్తున్నది. దీనిపై రోజుకు 2 టీఎంసీల నీటిని తోడే పాలమూరు-రంగారెడ్డి లాంటి భారీ ప్రాజెక్టు భారాన్ని మోపితే జూరాల మీద ఆధారపడిన ప్రాజెక్టులకే కాదు పాలమూరు ప్రాజెక్టు కూడా నీటి లభ్యత లేక చతికిల పడిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అక్కడ రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవడానికి వరద కూడా 23 రోజులకు మించి ఉండదని ఎస్కీ వారు అంచనా వేశారు.
కేసీఆర్ హయాంలో డీపీఆర్ వాపస్ వస్తే ఈ అనుమతులన్నీఎట్లా వచ్చినాయో విమర్శకులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. EAC సిఫారసు రాగానే ఇక పర్యావరణ అనుమతి రావడం ఖాయం అన్న భావనతో ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో కాలువల తవ్వకానికి టెండర్లు పిలిచింది. కేంద్ర సంస్థల నుండి అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద అదనపు ToRను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదిస్తూ 6.11. 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ స్వల్ప కాలంలోనే 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి రోజుకు 2.3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే భారీ ఎత్తిపోతల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. కృష్ణా జలాలకు అదనంగా తుంగభద్ర నుంచి 450-600 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతాయి. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి శ్రీశైలం జలాశయంలో 150 టీఎంసీల carryover storageని బచావత్ ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ అంశాలన్నిటి నేపథ్యంలో, వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రాజెక్టు సాఫల్యతను పెంచడానికి సోర్సును 7 టీఎంసీల జూరాల నుంచి 215 టీఎంసీల శ్రీశైలం జలాశయానికి మార్చాలని కూడా నిర్ణయం జరిగినది. అన్ని అధ్యయనాల తర్వాత సాంకేతిక అవసరాలను, ముంపును దృష్టిలో పెట్టుకొని నీటి సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమే సరైందని అందరూ స్వాగతించారు.
పైన పేర్కొన్న నిర్ణయాలను పరిగణనలోనికి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీ-డిజైన్ చెయ్యాలని ప్రాజెక్టు డీపీఆర్ తయారుచేస్తున్న ఎస్కీవారిని ప్రభుత్వం ఆదేశించింది. రీ-డిజైన్ అనంతరం ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 1) నీటి సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం, 2) ఆరు కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, 3) ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం, 4) గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడం.
90 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు.. మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తుదిరూపం తీ సుకున్నాయి. రీ-డిజైన్ తర్వాత నీటి నిల్వ సా మర్థ్యం 121 టీఎంసీల నుంచి 68 టీఎంసీలకు తగ్గించడంతో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. ముంపు గ్రామాలు 47 నుంచి 3+20 తండాలకు, ముంపు బారిన పడే భూ మి 80 వేల నుంచి 50 వేల ఎకరాలకు, జనా భా 84 వేల నుంచి 11 వేలకు తగ్గిపోయింది.
పై ప్రతిపాదనల్ని10.06.2015న మంత్రివర్గం ఆమోదించడంతో ప్రభుత్వం జీవో నంబరు 105 తేదీ 10.06.2016 ద్వారా ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టుకు 11.06.2015 తేదీన కరివెన గ్రామం వద్ద శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పనులను 18 ప్యాకేజీలుగా విభజించి 27-01-2016న టెండర్ నోటీసు జారీచేసింది ప్రభుత్వం. 06.06.2016న ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభమైనాయి. అయితే కొన్ని దుష్టశక్తులు పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టినారని డిసెంబర్ 2016లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయడంతో ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఏకపక్షంగా స్టేను గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. ఈ అప్రజాస్వామిక చర్యపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన స్టేను ఎత్తివేసి రాష్ట్ర వాదనలు కూడా వినాలని, పర్యావరణ అనుమతులు అవసరం లేని తాగునీటి పనులు చేసుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కేసు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా తాగునీటి పనులను చేసుకోవడానికి అనుమతించింది. సాగునీటి కాలువల పనులు మాత్రం పర్యావరణ అనుమతులు సాధించిన తర్వాతనే చేపట్టాలని ఆదేశించింది.
ఈ కేసుల కారణంగా కోర్టుకు సమర్పించిన హామీ మేరకు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను రెండు దశలలో పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు (Drinking Water Comp onent), రెండో దశలో సాగునీటి సరఫరా పనులు (Irrigation Component) పూర్తి చేయాలని నిర్ణయించింది. తాగునీటి పనుల కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదు. ప్రభుత్వం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర బడ్జెట్ నుంచే కాక కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా 10 వేల కోట్ల నిధులను సమకూర్చింది. ఆగస్ట్ 2023 నాటికి తాగునీటి సరఫరా పనులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయి. నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో మొదటి పంపు (145 మెగావాట్) డ్రైరన్ 2023 ఆగస్ట్ 3న విజయవంతం అయిన తర్వాత సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది. ప్రాజెక్టు ద్వారా నీరు సరఫరా జరుగుతుందన్న భరోసా ప్రజలకు కలిగింది.
ఇకపోతే.. సాగునీటి పనులు ప్రారంభించాలంటే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి సాధించవలసి వచ్చింది. నికరజలాలు ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే కేంద్రం అనుమతులు ఇస్తుంది. పాలమూరు ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించినవి 70 టీఎంసీల వరద జలాలు మాత్రమే. ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపడానికి 90 టీఎంసీల నికర జలాలను ప్రభుత్వం కేటాయించింది.
మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీల మిగులు జలాలను, పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల గోదావరి నీటికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన లభించే కృష్ణాజలాల్లో తెలంగాణ వాటా 45 టీఎంసీలు.. మొత్తం 90 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పునర్ కేటాయింపులు (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంతిమ తీర్పునకు లోబడి) చేస్తూ జీవో నంబరు 246ను 18.8.2022న జారీ చేసింది ప్రభుత్వం. రూ.55,080 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను తయారుచేసి కేంద్ర జలసంఘానికి, పర్యావరణ మంత్రిత్వ శాఖకు, ఇతర కేంద్ర సంస్థలకు పంపింది. ఈ జీవోపై కూడా ఆంధ్రప్రదేశ్ కృష్ణా ట్రిబ్యునల్‌లో కేసు వేసి జీవో అమలు కాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసింది. ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ వాదనలను కేసీఆర్ ప్రభుత్వం బలంగా తిప్పికొట్టింది. తెలంగాణ వాదనతో అంగీకరించిన ట్రిబ్యునల్ ఏపీ కేసును తిరస్కరించింది. ఈ తీర్పుతో subjudice అన్న సమస్య తొలగిపోయింది. ప్రాజెక్టుకు సీడబ్ల్యుసీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇతర కేంద్ర సంస్థల నుంచి అనుమతులు సాధించడానికి మార్గం సుగమం అయ్యింది.
సెప్టెంబర్ 2023 వరకు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సాధించిన 7 అనుమతులు ఇవి
10.08.2023న పర్యావరణ అనుమతి ఇవ్వొచ్చునని నిపుణుల సలహా కమిటి (EAC) కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సిఫారసు. EAC సిఫారసు ఉన్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతి ఇవ్వడం లాంఛనం మాత్రమే.
కేసీఆర్ హయాంలో డీపీఆర్ వాపస్ వస్తే ఈ అనుమతులన్నీఎట్లా వచ్చినాయో విమర్శకులు ప్రజలకు వివరణ ఇవ్వాలి. EAC సిఫారసు రాగానే ఇక పర్యావరణ అనుమతి రావడం ఖాయం అన్న భావనతో ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో కాలువల తవ్వకానికి టెండర్లు పిలి చింది. కేంద్ర సంస్థల నుండి అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగుతుండగానే కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద అదనపు ToRను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదిస్తూ 6.11. 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 45 టీఎంసీల పోలవరం నీటి అంశం కూడా ఉండడంతో అది మళ్లీ subjudice అంశంగా మారిపోయింది.
కేంద్ర సంస్థలు అనుమతులు జారీ చేయడం ఆపేసినాయి. అదే సమయంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్రంలో చంద్రబాబు మద్దతుతో మోడీ ప్రభుత్వం ఏర్పడడంతో.. subjudice అనే సాకు చూపి ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యుసీ డిసెంబర్ 2024లో అధికారికంగా వాపస్ చేసింది. దానితో EAC సిఫారసు ఉన్నా పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి జారీ చేయకుండా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం కష్టపడి కృష్ణా ట్రిబ్యునల్‌లో SubJudice అంశాన్నితొలగించుకొని ప్రాజెక్టుకు అనుమతులు సాధించుకునే పనిలో ఉంటే SubJudice అంశాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి అనుమతుల ప్రక్రియకు కాలు అడ్డం పెట్టింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణా అడిగింది 14.7.2014 చేసిన ఫిర్యాదును సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయమని మాత్రమే. గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే45 టీఎంసీల కృష్ణా జలాలు నాగార్జునసాగర్ ఎగువన ఉన్న తెలంగాణకు గోదావరి అవార్డు ద్వారా హక్కుగా దక్కినవి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలు తమకు లభించిన 35 టీఎంసీలను వాడుకుంటున్నాయి కూడా. గోదావరి ట్రిబ్యునల్ పరిష్కరించిన అంశాన్ని మళ్ళీ కృష్ణా ట్రిబ్యునల్‌కు నివేదించమని ఎవరూ అడగకపోయినా కేంద్రం అదనపు ToRలో చేర్చి ఆ అంశాన్ని మళ్ళీ subjudiceగా మార్చింది. ఈ పాపం ఎవరిది శ్రీరాం గారు?
గడచిన రెండేండ్లలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి సాధించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. కేంద్రంతో పోరాడి ఆ అనుమతి సాధించి ఉంటే సాగునీటి సరఫరాకు కాలువలు తవ్వే వెసులుబాటు ఏర్పడి ఉండేది. ప్రాజెక్టు సాగునీటి కాలువల తవ్వకం పనులపై ఎన్జీటి స్టే ఉన్నది కనుక పర్యావరణ అనుమతి సాధించేవరకు ప్రాజెక్టులో కాలువల తవ్వకం అనేది సాధ్యం కాదు. అందుకే రెండేండ్లు గడచినా ప్రస్తుత ప్రభుత్వానికి కూడా కాలువల తవ్వకం సాధ్యపడలేదు.
27 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు ఎందుకు నీరివ్వలేకపోయింది? అన్న ఆరోపణకు జవాబు ఇదే. పర్యావరణ అనుమతి సాధించడానికి కేసీఆర్ ప్రభుత్వం 99 శాతం విజయం సాధించింది. ఇంకొక్క మెట్టు ఎక్కితే పర్యావరణ అనుమతి సాధించేది. ఈలోపల రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. డీపీఆర్ వాపస్ అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం పిలిచిన టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
90 టీఎంసీల డీపీఆర్‌కు అనుమతులు సాధించడానికి మోడీ ప్రభుత్వంతో పోరాడడానికి బదులు 45 టీఎంసీలకు తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధపడడం అంటే పాలమూరు ప్రాజెక్టు ప్రయోజనాలను పణంగా పెట్టినట్టే. 45 టీఎంసీలతో పాలమూరు జిల్లా ఆయకట్టుకే సాగునీరు ఇవ్వలేము. ఇక రంగారెడ్డి, నల్లగొండ ఆయకట్టును పక్కన పెట్టవలసిందే. పాలమూరు పంపింగ్ వ్యవస్థతో ముడిపడిన డిండి ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా ఎట్లా? 2014 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రణాళికల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతామని వాగ్దానం చేసినాయి.
బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ ఎన్నికల సభలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని వాగ్దానం చేసినారు. పదేండ్లుగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ తను మహబూబ్‌నగర్ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన కర్తవ్యాన్ని మరచిపోయారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా కనీసం అన్ని చట్టబద్ధ అనుమతులు ఇ చ్చి ప్రాజెక్టు పూర్తి కావడానికి సహకరించవలసి ఉండే. అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి డీపీఆర్‌ను వాపస్ చేసింది మోదీ ప్రభుత్వం.
ఆయన ప్రజలకిచ్చిన హామీని గుర్తు చేయవలసిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శ్రీ రాం లాంటి మేధావులు.. చిత్తశుద్ధితో ప్రాజెక్టు పనులను కాళేశ్వరంతో పాటే కొనసాగించిన కేసీఆర్‌నే నిందిస్తున్నారు. ఇదేమి చోద్యం? ఇక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వెదిరె లాంటి మేధావులు రంగంలోకి దిగి వారికి రక్షణగా నిలుస్తున్నారు. ఇంతకంటే మేధో దివాలాకోరుతనం (Intellectual Bankruptcy) మరొకటి ఉండదు.
మరి ఏమిటి మార్గం? 45 టీఎంసీల గోదావరి నీటి అంశాన్ని అదనపు ToRలో కేంద్రం ఒక ప్రత్యేక అంశంగా చేర్చినందున ట్రిబ్యునల్‌ను మొదట ఈ అంశాన్ని పరిష్కరించమని కోరాలని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఆ నీటిని ట్రిబ్యునల్ తప్పకుండా తెలంగాణ వాడుకోవడానికి అనుమతిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి. 45 టీఎంసీలను సాధించి మొత్తం 90 టీఎంసీల ప్రాజెక్టుకు హై డ్రాలజీ, పర్యావరణ అనుమతులు సాధించి కా లువల తవ్వకం చేపట్టాలని వారి సూచన.
– శ్రీధర్‌రావు దేశ్‌పాండే 94910 60585