ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన శివసేనను చీల్చిన సంతోషం బీజేపీకి ఎంతోకాలం నిలువలేదు. 20 ఏండ్ల క్రితం విడిపోయిన థాకరే సోదరులు తిరిగి ఏకమయ్యారు. మరాఠా అస్తిత్వ నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి సంకీర్ణ భాగస్వామి ఎన్సీపీ (అజిత్ పవార్) వేరుకుంపటి పెట్టుకుంది. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల్లో దూసుకుపోయిన బీజేపీ నాయకత్వంలోని మహాయుతి వర్తమాన పరిణామాలతో కలవరపడుతున్నది. ఈనెల 15న జరుగనున్న 29 కార్పొరేషన్ల ఎన్నికలపై కొత్త రాజకీయ సమీకరణల ప్రభావం ఉంటుందా? దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న బృహణ్ ముంబై నగరపాలక పీఠం బీజేపీ వశమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మూడింట ఒక వంతు స్థానాలు ఈ 29 కార్పొరేషన్ల పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేకించి దేశ ఆర్థిక రాజధాని ముంబైని గెలుచుకోవాలన్నకృతనిశ్చయంతో రెండేండ్లుగా పావులు కదుపుతోంది బీజేపీ. అందులో భాగంగా దశాబ్దాలుగా ముంబైపై ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తున్న శివసేనను రెండుగా చీల్చి అధికారం నుండి దించేసింది. చీలికవర్గం నాయకుడు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా మహాయుతి పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పనిలో పనిగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చి చీలికవర్గం నేత అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో బలమైన మరాఠా అస్తిత్వ శక్తులు రెండూ బలహీనమయ్యాయి. ఇదే అదనుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు, పైచేయి సాధించిన షిండే, అజిత్ పవార్లను ఉపముఖ్యమంత్రులుగా చేసి పక్కన పెట్టేసింది. ఫడ్నవీస్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ సంక్రాంతికి జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యేకించి ముంబైలో పాగా వేయడం ద్వారా మహారాష్ట్ర సర్వంసహాధికారాన్ని కైవ సం చేసుకోవచ్చని భావించిన బీజేపీ తాజా రాజకీయ పరిణామాలతో బిత్తరపోయింది.
1966లో పాత్రికేయుడు బాల్ థాకరే మరాఠా అస్తిత్వ నినాదంతో శివసేన ప్రారంభించారు. ఐదేండ్లకే మహారాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయికి శివసేన చేరుకుంది. ప్రత్యేకించి రాజధాని ముంబై నగరంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. హిందుత్వ భావసారూప్యతతో దగ్గరైనా ఏనాడూ శివసేనను దాటి వెళ్ళే సాహసం చేయలేక పోయింది బీజేపీ. బాల్ థాకరే బతికున్నంత కాలం మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబైలో ఆయన చెప్పిందే వేదం. అయితే తమ్ముని కుమారుడు రాజ్ థాక్రే 2006లో శివసేనను వీడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఏర్పాటు చేశారు. దాంతో శివసేన ఒక కుదుపునకు గురయింది. 2012లో బాల్ థాకరే మరణించాక ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే శివసేనకు నాయకత్వం వహించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపి సంకీర్ణం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. శివసేన నుంచి బీజేపీ విడిపోయి బయటకు వచ్చిన ఏక్నాథ్ షిండే మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ చీలిక వర్గం కూడా పంచన చేరింది.
వడ్డించే వాళ్ళు తనవాళ్ళే కదా. ఇంకేముంది అసలైన శివసేన, ఎన్సీపీ అవేనంటూ ఎన్నికల కమిషన్ నిర్ధారించింది. ఆ పార్టీలకు అసల్దార్ అధినేతలైన ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ తమ పార్టీ పేర్లు సహా ఎన్నికల గుర్తులను సైతం కోల్పోయారు. ఇంత జరిగినా గత లోక్‌సభ ఎన్నికల్లో వారిద్దరి నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 30 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి 18కే పరిమితమైంది. అయితే ఆరు నెలలకే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా మహాయుతి ఘన విజ యం సాధించింది. అదే ఒరవడిలో గత డిసెంబర్లో జరిగిన మున్సిపల్, నగర పంచాయ తీ ఎన్నికల్లో జోరును కొనసాగించింది. ఈ నె ల 15న జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ముచ్చటగా మూడో విజయాన్ని ముద్దాడాలనుకున్న కూటమిలో వరుస రాజకీయ పరిణామాలు బీజేపీకి కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రే శివసేన, రాజ్ థాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఒక్కటి కావడం ముంబై సహా మిగతా కార్పొరేషన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
శివసేన నుండి నవనిర్మాణ సేన విడిపోయిన తర్వాత 2007, 2012, 2017లో జరిగిన ముంబై నగరపాలక ఎన్నికల్లో శివసేన పైచేయి సాధించి అధికారం కైవసం చేసుకున్నప్పటికీ నవనిర్మాణ సేన గణనీయమైన ఓట్లను, సీట్లను సాధించింది. ఇప్పుడు ఈ రెండూ ఒక్కటి కావడం అగ్నికి వాయువు తోడైనట్టు అయ్యింది. మరోవైపు సంకీర్ణ భాగస్వామి అజిత్ పవార్ ఎన్సీపీ 94 సీట్లలో సొంతంగా పోటీ చేస్తున్నది. పైగా శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి పుణె, పింప్రీ చించ్వాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సంకీర్ణానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగింది. నాగపూర్లోనూ అదే పరిస్థితి.
మిగతా కార్పొరేషన్ల సంగతి అలాఉంచితే ఇప్పుడు దేశం చూపంతా ముంబై వైపే ఉంది. 2022 మార్చి లోపే ఎన్నికలు జరగాల్సి ఉండగా సుమారు నాలుగేండ్లు కాలయాపన జరిగింది. 137 ఏండ్ల చరిత్ర కలిగి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన ముంబై వార్షిక బడ్జెట్ రూ 40 వేల కోట్లు. 1972 నుండి పడుతూ లేస్తూ పదేండ్లు పరిపాలించిన శివసేన 1997 నుండి పాతుకుపోయి 2022 వరకు ముంబై పీఠంపై అధివసించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా పాతికేండ్ల పాటు ముంబై పీఠం శివసేనదే. ప్రారంభంలో అంతగా బలంలేని బీజేపీ శివసేన పంచన చేరి ఎదిగి వచ్చి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు ఆశ్రయమిచ్చిన శివసేననే చీల్చింది.
సూదిలా వచ్చి దబ్బనంగా మారడం బీజేపీకి అలవాటే. భేద, దండోపాయాలతో ఢిల్లీని కైవసం చేసుకున్న బీజేపీ ముంబైపై కన్నువేసింది. 1951లో ఏర్పడ్డ భారతీయ జనసంఘ్‌కు గానీ ఆ పేరు మార్చుకొని కొత్తపేరుతో 1980లో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీకి గానీ ముంబై మేయర్ పీఠం 65 ఏండ్లుగా అందని ద్రాక్షే అయింది. అందుకే ఈ ఎన్నికల్లో అప్పుడే ముందస్తు అక్రమాలకు తెర లేపింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 68 మంది ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంలో ఆ త్యాగధనులకు నజరానాల రూపంలో రూ.50 కోట్ల చొప్పున రూ.3500 కోట్లు అందాయని విపక్షాలు ఆరోపించాయి.
బాల్ థాకరే మరణానంతరం మసకబారుతూ వచ్చిన మరాఠా అస్తిత్వం మళ్లీ తలెత్తింది. సోదరులు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలను తిరిగి ఒకటి చేసింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన హిందీ తప్పనిసరి విధానం దక్షిణాది రాష్ర్టాలతో పాటు మహారాష్ట్రలోనూ బెడిసి కొట్టింది. ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఒక సభలో ’జై గుజరాత్’ అని నినదించడం మరాఠాల కోపానికి కారణమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ జాదవ్ ముంబైని గుజరాత్ రాజధానిగా వ్యాఖ్యానించడం పెను సంచలనం కలిగించింది. 1960లో ముంబాయి నుండి విడిపోయి ప్రత్యేక గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ గుజరాతీయులు, మరాఠాలకు మధ్య ముంబై ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ‘ఆవాజ్ మరాఠీచి ‘ నినాదం ముందుకొచ్చింది. ముంబై నగరం తమది కాకుండా పోతుందేమోనన్న ఆందోళన అక్కడి మరాఠీలను వేధిస్తున్నది. ఏ ఇతర రాష్ర్టాల రాజధానుల్లో లేనివిధంగా ముంబై జనాభాలో మరాఠీ మాతృభాషగా కలిగినవారి సంఖ్య 36%కు పడిపోయింది. హిందీ రాష్ర్టాల నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డవారు 23 శాతం ఉంటే గుజరాతీలు 12 శాతానికి చేరుకున్నారు. తమ వ్యాపార విస్తరణతో ముంబైని శాసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ర్టేతర ఉత్తరాది రాష్ర్టాల ఓట్లను ఆశిస్తున్న కాంగ్రెస్ థాక్రే సోదరులు ముందుకు తెచ్చిన మరాఠా అస్తిత్వ జెండా ఎత్తుకోవడానికి జంకి ఆ కూట మి నుంచి బయటకు వచ్చి 143 స్థానాల్లో పో టీకి దిగింది. రాజకీయ స్వార్థం కోసం రాష్ర్టాల అస్తిత్వాన్ని బలి పెట్టడానికి జాతీయ పార్టీలు వెనుకాడవన్నది మరోసారి రుజువయింది.
సంపూర్ణ ఆధిపత్యం కోసం, పతనావస్థ నుండి పునరుత్థానం కోసం కాంగ్రెస్, మరాఠా అస్తిత్వం ఆత్మగౌరవం కోసం థాక్రే సోదరులు మూడువైపులా తమ సంకీర్ణ సేనలతో మోహరించి తలపడుతున్న మహారాష్ట్ర కార్పొరేషన్ కదనరంగంలో ప్రత్యేకంగా ముంబై విజయం కీలకం కానుంది. పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు. ఇక బాల్ థాకరే వారసత్వం ముంబైని నిలబెట్టుకుంటుందా లేక కైవసం చేసుకుని తన 65 ఏండ్ల కలను బీజేపీ నిజం చేసుకుంటుందా చూడాలి.
కొసమెరుపు: గత డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడ్డ అంబర్‌నాథ్‌లో కాంగ్రెస్‌తో, అకోట్ మున్సిపాలిటీలో ఎంఐఎంతో జతకట్టి బీజేపీ చైర్మన్ పదవులు కొట్టేసింది. ఈ అపూర్వ కలయికను ఆయా పార్టీల అధిష్ఠానాలు వ్యతిరేకించాయి. అయితేనేం అంబర్నాథ్ వికాస్ అఘాడీ, అకోట్ వికాస్ మంచ్ పేరుతో కొత్త దుకాణాలు తెరిచి కొనసాగుతున్నారు. హతవిధీ.
– డా. అయాచితం శ్రీధర్ 98498 93238