Tungabhadra | అయిజ, మార్చి 20 : ఆర్డీఎస్ వాటా నీటిని కర్ణాటక రైతులు అక్రమంగా తోడేశారు. ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి నీటి వాటాను కర్ణాటకలోని టీబీ డ్యాం ద్వారా తుంగభద్ర నదిలోకి ఈ నెల 5 నుంచి 13 వరకు 3.12 టీఎంసీలు వదిలారు. నదిలోకి వచ్చిన నీటిని వచ్చినట్టే కర్ణాటకలో ఏర్పాటు చేసిన భారీ లిఫ్టులు, మోటర్లు, తాగునీటి పథకాల ద్వారా మళ్లించుకుపోయారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు 0.276, సుంకేసులకు 0.430 టీఎంసీల నీళ్లు మాత్రమే చేరాయి. ఈ ఏడాది ఆర్డీఎస్కు 5.896 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 7.746 టీఎంసీలను టీబీ బోర్డు కేటాయింపులు జరిపింది.
అలంపూర్ నియోజకవర్గంలో యాసంగిలో సాగు చేసిన 37 వేల ఎకరాల చివరి విడుత తడికి ఆర్డీఎస్ నీటి వాటా 1.173 టీఎంసీలు, కేసీ కెనాల్ నీటి వాటా 1.944 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ, ఏపీ తుంగభద్ర బోర్డు కార్యదర్శికి లేఖలు రాశాయి. దీంతో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం, అధికారులు టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయగానే నదిలో పారుతున్న నీటిని కర్ణాటక రైతులు అక్రమంగా తోడేసుకున్నారు. నేడు ఆర్డీఎస్, సుంకేసుల బరాజ్‌లో నీటి నిల్వలు పెరగలేదు.
దీంతో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు వీలు లేకుండాపోయింది. ప్రస్తుతం ఆర్డీఎస్లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనకట్టలో నీటిమట్టం 4.5 అడుగులకు చేరగా.. గురువారం డీ-14 వరకు మాత్రమే నీళ్లు చేరాయని ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ నెల చివరి వరకు సాగునీరు అందితే పంటలు చేతికొచ్చే అవకాశం ఉన్నదని, ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.