హైదరాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం రద్దు చేసేంత వరకు పోరాడుతామని పలు ప్రజా సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చాయి. మంగళవారం ప్రజా సంఘాల ఆధర్యంలో మోదీ, ట్రంప్‌ల దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను తెచ్చి కార్పొరేట్ యాజమాన్యాలకు లాభం చేకూర్చేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని, అందులో భాగమే అమెరికాతో వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మొకజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా దిగుమతి అవుతాయని తెలిపారు.
దీంతో మన రైతాంగం పండించిన పంటలకు డిమాండ్ తగ్గి, రైతులు దివాలా తీసే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం విత్తన చట్టం, విద్యుత్తు చట్టాల్లో మార్పులు చేస్తున్నదని దీంతో రైతులు, ప్రజలపై పెనుభారం పడుతుందని తెలిపారు. కొత్తగా తెచ్చిన వీబీజీ-రామ్జీతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి దొరికే పరిస్థితులు ఉండవని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధానాలకు నిరసనగా ఈనెల 12న ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, ఈశ్వరరావు, ఎస్వీ రమ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు బొప్పని పద్మ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా వాహన సేవలు బంద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర వాహన సంఘాల జేఏసీ మంగళవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు గుప్పించి, వాటి అమలును మర్చిపోయిందని విమర్శించింది. డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి గురువారం రాష్ట్రవ్యాప్తంగా వాహనాల బంద్ పాటిస్తున్నట్టు వెల్లడించింది. బంద్‌లో ఏఐటీయూసీ, బీఆర్టీయూ, సీఐటీయూ, ఐఎన్టీయూ, టీయూసీఐ, టీఎన్టీయూసీ, టీఏడీఎస్, ఐఎల్డబ్ల్యూఫ్, ఐఎఫ్టీయూ, టీఏఎండీయూ, జీయూటీఎస్, టీటీడబ్ల్యూ తదితర సంఘాలన్నీ పాల్గొంటున్నట్టు ప్రకటించింది.