హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ) : మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(రైతు డిస్కమ్)తో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. బహిరంగ విచారణలో 3వ డిస్కమ్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని వినియోగదారులు, సంస్థలు, విద్యుత్‌రంగ నిపుణులు, రైతు సంఘాలు సూచించిన విషయాన్ని ఆ లేఖ ద్వారా గుర్తుచేశారు. ప్రస్తుత రెండు డిస్కమ్‌లపై 3వ డిస్కమ్‌కు అధికారాలు ఉంటాయని, 3వ డిస్కమ్‌కు 35,218(42%) మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.
ఈ డిస్కమ్ నుంచి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేనప్పటికీ.. కొత్త డిస్కమ్ సబ్సిడీ భారాన్ని ఎలా భరిస్తుందని జాన్‌వెస్లీ ప్రశ్నించారు. కేంద్రం విద్యుత్ చట్టం-2003ను సవరిస్తూ పార్లమెంట్లో ఆమోదం పొందిందని, దీని ప్రకారం క్రాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్తు రద్దు చేయాల్సి ఉంటుందని జాన్‌వెస్లీ పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి ఖర్చుకనుగుణంగా టారిఫ్‌లు నిర్ణయించాలని, డిస్పాచింగ్ సెంటర్ బాధ్యతలు కేంద్రం చూస్తుందని, విదేశాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేయవచ్చని చట్టం చెప్తున్నదని జాన్‌వెస్లీ గుర్తుచేశారు. ఈ చట్టం అమలుచేస్తే రాష్ట్ర వినియోగదారులపై తీవ్ర భారం పడతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తారా? లేదా అనేది స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విఫలమైన ఈ ప్రయోగాన్ని తెలంగాణ ప్రజలపై రుద్దవద్దని కోరారు. అందరికీ విద్యుత్తు, క్రాస్ సబ్సిడీ కొనసాగేలా విధానాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలను ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్లో తీవ్రమైన ప్రతిఘటన వచ్చిందని, ఇప్పుడు బడా కార్పొరేట్లకు విద్యుత్‌రంగాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేస్తే.. ప్రజాప్రతిఘటన ఎదురోవాల్సి వస్తుందని హెచ్చ రించారు. 3వ డిస్కమ్‌ను ఉపసంహరించుకొని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతను కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.