న్యూఢిల్లీ, మార్చి 28: క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం ప్రతిపాదించిన 30 శాతం పన్నును మరింతగా పెంచాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్.. జూదంతో సమానమని, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియాల్లో దీనిపై 55 శాతం వరకు పన్ను ఉందని తెలియజేశారు. సోమవారం రాజ్యసభలో కేటాయింపులు, ఆర్థిక బిల్లులపై చర్చ జరిగింది. ఇందులో భాగంగానే క్రిప్టోకరెన్సీలపై మీరు వేసిన 30 శాతం పన్నును మున్ముందు మరింతగా పెంచాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సుశీల్ కుమార్ కోరారు. ఇలాంటి ఊహాజనిత, స్పష్టమైన విలువ తెలియని కరెన్సీలను ప్రోత్సహించడం ప్రమాదకరమన్నట్టు వ్యాఖ్యానించారు. ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ లెండింగ్, సోషల్ మీడియా, ఎడ్‌టెక్‌ల నియంత్రణలకూ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సమాచార, సాంకేతిక చట్టం 2000లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.