న్యూఢిల్లీ: అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్‌ను పునర్వ్యస్థీకరించాలని సుప్రీం కోర్ట్ సోమవారం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, దాన్ని తార్కిక ముగింపునకు తీసుకెళ్లాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నొక్కి చెప్పింది. ఈ తరహా కేసుల్లో అనుభవమున్న సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా దర్యాప్తు కోసం మాత్రమే సిట్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తాము భావిస్తున్నట్టు కోర్టు తెలిపింది.
‘ఒక హెచ్చరిక. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదు. ఇది కేవలం ఒక నేరం జరిగిన కేసు. సరైన దర్యాప్తు జరిగేలా చూసేందుకే మేం ఇక్కడ ఉన్నాం’ అని సీజేఐ అన్నారు. ఈ నెల 27న తదుపరి విచారణ చేపడతామని.. అప్పుడు స్టేటస్ రిపోర్ట్‌ను పరీక్షించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.