Rahul Gandhi దేశ చరిత్రలోనే యువతను వ్యతిరేకించే ప్రధాని నరేంద్ర మోదీ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించాలని రాహుల్ డిమాండ్ చేశారు. సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా సీజేపీ కార్యకర్తలు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ ఘటనలో పలువురు గాయపడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశ చరిత్రలోనే యువతను అత్యధికంగా వ్యతిరేకించే ప్రధాని నరేంద్ర మోదీ. విద్యాశాఖ మంత్రిగా విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్‌ను కనీసం రాజీనామా చేయాలని కూడా మోదీ అడగటం లేదు. 152 పేపర్ లీకేజీలతో 7.5 కోట్ల మంది బాధితులయ్యారు. కానీ, ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకుని, శిక్షించలేదు. శిక్ష ఎవరికి పడింది..? పరీక్షల కోసం శ్రమించే యువతకు. ఈ పిల్లలు విద్యావ్యవస్థపై ప్రశ్నిస్తే.. వారిపై బలగాలతో దాడి చేస్తున్నారు. పేపర్ లీక్ చేసిన క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాటిని ప్రశ్నిస్తున్న విద్యార్థులు మాత్రం లాఠీ దెబ్బలు తింటున్నారు. ప్రభుత్వం యువతకు నష్టం కలిగించడమే కాకుండా వారి మీద పడిపోతోంది అంటూ రాహుల్ స్పందించారు.
మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థులు, యువతపై బలగాల్ని ప్రయోగించే తమ విధానాన్ని కేంద్రం సమీక్షించుకోవాలని ఆమె సూచించారు. ప్రధాని అన్నీ తానే చూసుకుంటానని చెబుతుంటారు. మరి దేశంలో పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. విద్యార్థులు, యువత ఆవేదనను ప్రధాని విని, స్పందించి, సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.