హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలోగా పంపిణీ చేయాలని డి మాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
దివ్యాంగుల సంక్షేమంలో భాగంగా 16 రకాల సహాయ ఉపకరణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 8 వేల మందికి రెట్రోలిఫ్టెడ్ మోటరైజ్డ్ వెహికిళ్లు, బ్యాటరీ వెహికిళ్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటోవెహికిళ్లు, హైబ్రిడ్ వీల్చైర్లు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు, ట్రైసైకిళ్లు, మోడ్రన్ వీల్చైర్లు, క్రూచర్స్, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్స్టిక్స్, స్మార్ట్కేన్స్, ఎంసీఆర్ చప్పల్స్ అందజేయాలని సంకల్పించారు. ఇందుకోసం 2025-26 బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించి గత మార్చిలోనే విడుదల చేశారు. ఈ క్రమంలో గత జూన్ 6న నోటిఫికేషన్ జారీ చేసి దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45వేల మంది దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం 7,920 లబ్ధిదారులను ఎంపికచేసి అన్ని జిల్లాలకు ఉపకరణాలను చేరవేశారు. కానీ, 4 నెలలు గడుస్తున్నా వాటిని పంపిణీ చేయలేదని దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎంపికైన లబ్ధిదారులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కార్యాలయాలకు ఉపకరణాలు చేరినా ఎందుకు పంపిణీ చేయడంలేదని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని వాపోతున్నారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు మొండిచెయ్యి చూపుతున్నదని మండిపడుతున్నారు. పింఛన్ల పెంపు దేవుడెరుగు కనీసం దైనందిన జీవితం గడిపేందుకు దోహదపడే ఉపకరణాలు ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నోసార్లు విన్నవించాక ప్రభుత్వం దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నాలుగు నెలల క్రితం లబ్ధిదారులను ఎంపికచేశారు. కానీ, పంపిణీ ఎందుకు చేస్తున్నా రో అర్థంకావడం లేదు. మంత్రి, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవమైన డిసెంబర్ 3లోగా పరికరాలు పంపిణీ చేయాలి. లేదంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం.
– వెంకట్, జాతీయ దివ్యాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు