పానిండియా నంబర్‌వన్ స్టార్ ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళుతుందా?! అని అభిమానులంతా ఇన్నాళ్లూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించాయి. ‘స్పిరిట్’ సినిమా ప్రారంభోత్సవాన్ని ఆదివారం లాంఛనంగా నిర్వహించారు. అగ్ర హీరో చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడంతో ఈ సినిమా తొలి షెడ్యూల్ మొదలైంది. పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, హాలీవుడ్ స్థాయి కథ, కథనాలతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘యానిమల్’ఫేం త్రిప్తి డిమ్రీ కథానాయిక. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్‌రాజ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని టి.సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.
రెబల్ సాబ్.. రొమాంటిక్ రెబల్ సాబ్.. ఇదిలావుంటే.. సంక్రాంతికి రాబోతున్న ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన తొలి గీతాన్ని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో మేకర్స్ విడుదల చేశారు. ‘రెబల్ సాబ్.. రెబల్ సాబ్.. రొమాంటిక్ రెబల్ సాబ్..’ అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ తరహాలో సాగింది. చాలారోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ ఈ పాటలో కనిపించాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా అదిరిపోయే బీట్తో తమన్ ఈ పాటను స్వరపరిచారు. పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకునేలా సినిమా వచ్చిందని, ప్రభాస్‌ని డైరెక్ట్ చేయడంతో తాను టాప్ డైరెక్టర్ని అయ్యానని, 12ఏండ్ల తర్వాత ప్రభాస్ ఇలాంటి పాటను మీకోసం చేశారని అభిమానుల్ని ఉద్దేశించి దర్శకుడు మారుతి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ కూడా మాట్లాడారు.