కొత్తగూడెం సింగరేణి/ టేకులపల్లి, నవంబర్ 23: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని గొంతెత్తి నినదించారు. త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల నాయకులు ఆదివారం ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల నాయకులు, టేకులపల్లిలో ఐఎఫ్టీయూ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత మూడేండ్లుగా మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరించిందని, మూడోసారి అధికారంలోకి వచ్చాక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.