హైదరాబాద్ (రామచంద్రాపురం), ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఆటో మొబైల్.. తాజాగా హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో రెండో యూనిట్‌ను ఆరంభించింది. 2020లో తొలి ప్లాంట్‌ను ఆరంభించిన సంస్థ.. రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉండటంతో మరో యూనిట్‌ను నెలకొల్పింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో తక్కువ స్పీడ్ నూతన జనరేషన్ ఈ బైకు ఆటమ్ 1.0తోపాటు ఇతర మోడళ్ళను ఉత్పత్తి చేస్తున్నది. దీంతో ఈ రెండు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 25 వేల నుంచి 3.5 లక్షలకు చేరుకోనున్నది. మార్కెట్లోకి కొత్తగా హైస్పీడ్ మోడల్ ఆటమ్ 1.0 కెఫే రేసర్ ైస్టెల్ ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ధర రూ.54,999(పన్ను మినహాయించి), వేగం గంటకి 25 కిలోమీటర్లు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీ ఫౌండర్, ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, కంపెనీ గ్రీన్ ఇనిషియేటివ్‌ని ముందుకు తీసుకువెళ్లడమేనని తెలిపారు. కొన్ని నెలల్లో తమ సంస్థ 50 కిలోమీటర్ల వేగం సామర్థ్యంతో 1.1, 70 కిలోమీటర్ల వేగంతో 2.2 బైక్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా 2.30 లక్షల ఈ-బైకులు అమ్ముడయ్యాయి.