హైదరాబాద్ జూలై 16(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. మ ద్యాన్ని సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా సీసాల సైజు ను సవరించేందుకు కసరత్తు చేస్తున్నది. ఆంధ్రాలో చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం సీసాలను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ధరల నిర్ణయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ కానున్నది. ఇప్పటికే కంపెనీలతో 11 సార్లు సమావేశమైన ఈ కమిటీ ధరల పెంపుపై తుది నిర్ణయాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఇదే సమయంలో రాష్ట్ర మద్యం మార్కెట్లో 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో కొత్త మద్యం బా టిళ్లు ప్రవేశపెట్టే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పరిమాణాల్లో మద్యం సీసాలను ఉ త్పత్తి చేయగలం అని ఇప్పటికే కొన్ని మద్యం కంపెనీలు టీజీబీసీఎల్‌కు తెలియజేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు సార్లు మద్యం ధరలు పెంచింది. గత ఏడాది ఫిబ్రవరిలో బీరు ధరలు 15 శాతం పెంచింది. రూ.210 ఉన్న బీరు ధరను రూ.30 నుంచి రూ.50 వరకు పెంచింది. అదే ఏడాది మేలో లిక్కర్ ధరలు పెంచింది. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు పెంచింది. తాజాగా మరోసారి ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం చీప్ లిక్కర్, మీడియం, ప్రీమియం, హయ్యర్ క్యాటగిరీ అన్ని తరహా బ్రాండ్లపై ధరల పెంపు ఉండే అవకాశం ఉంది.
ప్రీమియం బ్రాండ్ల ఫుల్‌బాటిల్‌పై రూ.100 వరకు, హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120, సాధారణ వినియోగదారులు ఎకువగా కొనుగోలు చేసే చీప్ లిక్కర్ మీద రూ.90 వరకు పెంపు ఉండవచ్చని సమాచారం. ధరల సవరణతోపాటు మద్యం బాటిళ్ల పరిమాణాల్లో మార్పులు చేయాలని తయారీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. కొత్త సీసాల ద్వారా నెలకు కనీసం 2 లక్షల కేసుల మద్యం అదనంగా విక్రయించవచ్చని టీజీబీసీఎల్ అంచనా వేస్తున్నది.