హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ తీసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 5 నుంచి రాష్ట్రంలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ఇప్పటికే మందగమనంలో ఉన్న స్థిరాస్తి రంగానికి ఉరితాడుగా మారబోతున్నది. మారెట్ ధరలకు అనుగుణంగా, శాస్త్రీయంగానే ధరలు పెంచామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయి.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ నిర్ణయం ‘మూలిగే నకపై తాటిపండు’ పడిన చందంగా ఉన్నదని ఐటీ, నిర్మాణ రంగ నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా భూముల క్రయవిక్రయాలు గణనీయంగా పడిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పూర్తిగా కుదేలైంది. ఐటీ (సాఫ్ట్వేర్) రంగంలో నెలకొన్న ఒడిదొడుకులు, మందగమనం వల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూములు కొనే నాథుడు లేక రియల్టర్లు, ఇండ్లు కట్టే ధైర్యం చేయలేక బిల్డర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూముల మారెట్ విలువలు పెంచడమంటే వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ప్రాణవాయువు (ఆక్సిజన్) తీసేయడమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిర్మాణ రంగానికి సంబంధించిన ముడిసరుకుల ధరలు ఇప్పటికే సామాన్యుడికి, బిల్డర్లకు చుకలు చూపిస్తున్నాయి. స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర, టైల్స్, ఎలక్ట్రికల్ వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు డీజిల్, పెట్రోల్ ధరల మంట రవాణా ఖర్చులను తడిసి మోపెడు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ విలువలను 25 నుంచి 100% మేరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారులు, స్టేట్ హైవేల పకన ఉన్న ప్రైమ్ ల్యాండ్స్ విలువను కనీసం 50%, వాణిజ్య భూముల విలువను ఎకరాకు కనీసం రూ.10 లక్షలు పెంచబోతున్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భూముల క్రయవిక్రయాలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉన్నది.
ప్రభుత్వ అనాలోచిత విధానాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలే అద్దం పడుతున్నాయి. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.14,295 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది అప్పటి బడ్జెట్ అంచనాల్లో 77.27 శాతానికి సమానం. కానీ, కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి దారుణంగా రూ. 8,473 కోట్లకు పడిపోయిం ది. ఇది బడ్జెట్ అంచనాల్లో కేవలం 45.48 శా తమే. దీన్ని బట్టే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఎంతలా కుదేలైందో అర్థం చేసుకోవచ్చు. అం దుకు కారణాలేమిటో పరిశీలించి రియల్ ఎస్టే ట్ రంగాన్ని ఆదుకోవాల్సిన రేవంత్‌రెడ్డి సర్కా ర్ భూముల మార్కెట్ విలువను మరింత పెం చడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.
రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు, అపార్ట్మెంట్ల విలువలు పెంచాలన్న నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను శాశ్వతంగా చెరిపేసే అవకాశం ఉన్నది. ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం స్థిరాస్తి రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసి, లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించకపోతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు తప్పదని ఆర్థిక, స్థిరాస్తి రంగాల నిఫుణులు హెచ్చరిస్తున్నారు.