హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ ): విజ్ఞాన్ వర్సిటీలో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభోత్సవం విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేసే కీలక ప్రయాణానికి నాంది అని గూగుల్ క్లౌడ్ ఎడ్యుకేషన్ రీజినల్ హెడ్ నవిషా ప్రభాకర్ పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జెమిని ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ ల్యాబ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నవిషా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్, ఆరోగ్యరంగం, రోబోటిక్స్, ఇంజినీరింగ్, ఆటోమేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక రంగాల్లో ఏఐ అపార అవకాశాలు సృష్టిస్తున్నదని పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తు సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడానికి విజ్ఞాన్ వర్సిటీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గూగుల్ భాగస్వామి సంస్థ హెనోటిక్ గ్రూప్ సీఈవో మల్లేశం, వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, వీసీ ప్రొఫెసర్ కేవీ కృష్ణకిశోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు.