Huzurabad Dumping Yard | హుజూరాబాద్, ఏప్రిల్ 20 : హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టి ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను పోలీసులు ప్రధాన గేటు వద్దే నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు కలెక్టరేట్ ఎదుటే ప్లకార్డులు, ఫ్లెక్సీలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 30 రోజులుగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుతంగా దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని వాపోయారు. ప్రజల గోడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వారు మండిపడ్డారు. పట్టణ వ్యర్థాలను గ్రామాల మీదకు నెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం కుంటుపడుతుందన్నారు. గాలి కలుషితం కావడం వల్ల చిన్నారులు, వృద్ధులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని ఉరిశాలగా మార్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తక్షణమే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రతిపాదనను రద్దు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష నాయకులు గుడిపాటి జైపాల్ రెడ్డి, సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, వేల్పుల ప్రభాకర్, మార్త రవీందర్, తునికి సమ్మయ్య, కొలిపాక సమ్మయ్య, బెల్లి రాజయ్య, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు, రామ్ రాజేశ్వర్, గుమ్మడి ఎల్లయ్య, పస్సుల స్వామి జయవర్ధన్, సందెల వెంకన్న, కొలిపాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.