– రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల
కట్టంగూర్, ఏప్రిల్ 20 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లారీల కొరత సాకుతో మ్యాచర్ వచ్చిన ధానాన్ని నిర్వాహకులు కాంటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాలు గింజ ఉందని మూడు నుండి నాలుగు కేజీల ధాన్యం మిల్లర్లు తరుగు తీస్తున్నారని ఆరోపించారు.
గ్రామాల్లో రైతుల నుంచి వ్యాపారులు ధాన్యం కోలుగోలు చేసి నిర్వహకుల అండదండలతో కేంద్రాల్లో విక్రయిస్తున్నారన్నారు. అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, రైతు సంఘం మండల కార్యదర్శి పింజర్ల కృష్ణ, జాల అంజనేయులు, బొడ్డుపల్లి నర్సింహ్మ, యన్నమల్ల రామలింగయ్య, రాజు, యాదయ్య. శంకరయ్య, రాములు పాల్గొన్నారు.