జైపూర్: ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ రిఫైనరీకి భారీ నష్టం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. (Fire At Rajasthan Refinery) రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్‌పద్రలో సుమారు రూ.80,000 కోట్ల వ్యయంతో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించాల్సి ఉన్నది.
కాగా, సోమవారం ఈ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో మంటలు, పొగలు దట్టంగా వ్యాపించాయి. 20కు పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌తో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో 2013 సెప్టెంబర్ 22న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ రిఫైనరీకి తొలిసారి శంకుస్థాపన చేశారు. దీని ప్రాథమిక అంచనా వ్యయం రూ. 37,230 కోట్లు. అయితే కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత 2018 జనవరి 16న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రాథమిక వ్యయాన్ని రూ. 43,129 కోట్లకు పెంచారు.
అయితే సుమారు రూ.80,000 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ ప్లాంట్ ద్వారా పాలీప్రొపీలిన్, పాలిథిలిన్, బెంజీన్, టోలుయీన్, బ్యూటాడైన్ వంటి పెట్రోకెమికల్స్ కూడా ఉత్పత్తి చేయనున్నారు. వాటి ఆధారంగా పలు పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుందని అంచనా.
Pachpadra, Rajasthan – A fire broke out at the under-construction HPCL Rajasthan Refinery (HRRL) in Pachpadra, raising concerns just a day before Prime Minister Narendra Modi’s planned inauguration of the ambitious ₹80,000-crore project. pic.twitter.com/kiiXNXK8WX
— NextMinute News (@nextminutenews7) April 20, 2026