మంచిర్యాల అర్బన్, జూలై 23: ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఆటో కిరాయిలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ర్యాపిడో సర్వీస్ ద్వారా జీవనోపాధి పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరారు. మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఆర్ డబ్ల్యూఏ, బీఆర్ టీయూ, బీఎంఎస్, 246 మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్, జేఏసీ ఆటో యూనియన్ తదితర ఆటో సంఘాల జిల్లా నాయకులు పాల్గొని ఆటో డ్రైవర్లు ఎదురొంటున్న సమస్యలపై చర్చించారు. ర్యాపిడో కార్యకలాపాలను అరికట్టేందుకు అన్ని ఆటో యూనియన్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ తగ్గిపోయి వేలాది మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే రూ.వెయ్యి కోట్ల నిధులతో ఆటో కార్పొరేషన్‌ను, ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు రోజుకు రూ.500 చొప్పున జీవన భృతి అందించి నెలకు రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు దాటిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.
ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం కల్పించడంతో పాటు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ఇతర ప్రభుత్వ రుసుములను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, వరింగ్ ప్రెసిడెంట్ ఎండీ షఫీ, ప్రధాన కార్యదర్శి తగరం శ్రీనివాస్, జేఏసీ జిల్లా అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్, ఆర్డబ్ల్యూఏ పట్టణ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు చల్ల విక్రం, 246 ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొట్ట మధు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అభిపాషా, ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.