మెట్పల్లి రూరల్, ఆగస్టు 8: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. 33కేవీ సామర్థ్యం గల విద్యుత్ లైన్ను నిర్లక్ష్యంగా మార్చడంతో వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీలైన్ను ఆనుకొని విద్యుత్ సరఫరా జరగడంతో 12 వ్యవసాయ మోటార్లు కాలిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామ శివారులోని ఇస్కాన్ ఆలయ సమీపంలో 33కేవీ సామర్థ్యం గల విద్యుత్ స్తంభాన్ని సంబంధిత అధికారులు మూడు రోజుల క్రితం వేరే చోటుకు మార్చారు. దీనికి అత్యంత సమీపంలోనే ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీ (లోటెన్షన్) లైన్ ఉంది. దీంతో గాలికి 33కేవీ విద్యుత్ తీగలు ఎల్టీలైన్ను తాకడంతో అధిక విద్యుత్ సరఫరా జరిగింది. ఫలితంగా 12 మంది రైతులకు చెందిన 5 హెచ్పీ సామర్థ్యం గల వ్యవసాయ మోటర్లు, స్టార్టర్లు, ఫ్యూజులు కాలిపోయాయి.
వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లిన ఒక్కో రైతు తమ మోటర్లు కాలిపోవడాన్ని గుర్తించారు. అల్లూరి రాజేశ్వర్రెడ్డి, అల్లూరి రాములు, లింగాపురం రాజశేఖర్, పడిగెల రాజశేఖర్, కుంబం పెద్దగంగారాం, ఏలేటి నవీన్, వెల్మ అశోక్, వెల్మ రాజేందర్, తీగల రవీందర్, ఎలాల శంకర్, ఏలేటి రాజేందర్, ఏలేటి సత్యనారాయణకు చెందిన వ్యవసాయ మోటర్లు కాలిపోయాయి. విద్యుత్ అధికారులకు సమాచారం అందించగా, శనివారం మెట్పల్లి రూరల్ ట్రాన్స్కో ఇన్చార్జి ఏఈ రమేశ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 33కేవీ తీగలు ఎల్టీలైన్ను తాకడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఏఈ తెలిపారు. 33కేవీ తీగలు ఎల్టీ లైన్ను తాకకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
పరిహారం ఇవ్వాలి
33కేవీ లైన్ షిఫ్టింగ్ను అధికారులు నిర్లక్ష్యంగా చేపట్టారు. మా వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీలైన్కు దగ్గరగా 33కేవీ లైన్ మార్చారు. చిన్నపాటి గాలికే రెండు లైన్లు ఒకదానికొకటి తగిలాయి. కరెంట్ ఎక్కువ సరఫరా కావడంతో నాతోపాటు 12 మంది రైతుల 5 హెచ్పీ వ్యవసాయ మోటర్లు, స్టార్టర్లు, ఫ్యూజులు కాలిపోయాయి. ఒక్కో రైతుకు రూ. 10 వేల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ తరఫున బాధిత రైతులకు నష్టపరిహారం అందించాలి.
– అల్లూరి రాజేశ్వర్రెడ్డి, బాధిత రైతు, చౌలమద్ది