హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలను విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ప్రభుత్వం అందించే రేషన్, పెన్షన్లు, విద్య, వైద్యం, గృహ, ఉపాధి, రైతు సహాయం తదితర సంక్షేమ పథకాలు ఏ మాత్రం ఉచితాలు కావని పేర్కొన్నారు.
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు, సామాజిక అసమానతలు తగ్గించేందుకు ప్రజాధనాన్ని వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. పేదలకు అందుతున్న సంక్షేమంపై ఆర్థికభారం పేరుతో ప్రశ్నలు లేవనెత్తే ముందు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రభుత్వ భూముల కేటాయింపులు, ప్రాజెక్టుల్లో జరిగే దుబారా, అవినీతిని పరిశీలించాలని జాన్వెస్లీ సూచించారు.