హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 110, డీమ్డ్ వర్సిటీ కాలేజీల్లో 100 సీట్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 600 సీట్లు పెంచుతున్నట్టు బుధవారం ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీట్లను ఈ ఏడాది నీట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుడు 8,840 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా తాజా పెంపుతో ఆ సీట్ల సంఖ్య 9,650కి పెరిగింది. కాగా, రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా, రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మినహా మిగతా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మౌలిక వసతులు, ఫ్యాకల్టీ కొరతతో సతమతం అవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా.. నేడు ఆ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
కాంగ్రెస్ అధికారం చేపట్టి 30 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ కొరత తీర్చడంలో విఫలమైందనే వాదన వినిపిస్తున్నది. ఎన్ఎంసీ నిబంధనల మేరకు ప్రతి 100 మంది మెడికల్ విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు ఉండాలి. కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 27 విభాగాల్లో జీరో ఫ్యాకల్టీ, 120 విభాగాల్లో ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్, 150 విభాగాల్లో అసలు సీనియర్ ఫ్యాకల్టీ లేదని ఇటీవల వైద్యులు నిర్వహించిన సర్వేలో తేలింది.
పలు ప్రభుత్వ వైద్య కాలేజీ క్యాంపస్‌ల్లో హాస్టళ్లు లేకపోవడంతో లాడ్జిల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. భూపాలపల్లిలో హాస్టల్ లేకపోవడంతో సింగరేణి క్వార్టర్స్‌లో హాస్టల్‌ను నడుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 2,900 ఫ్యాకల్టీ పోస్టులకు ప్రభుత్వం కేవలం 400 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఏడాది పూర్తయినా పోస్టులు భర్తీ చేయకపోవడంతో నాణ్యమైన వైద్య విద్య ప్రశ్నార్థకంగా మారుతున్నది.
ఎంబీబీఎస్ పూర్తయ్యాక పీజీ చేయాలనుకునే వైద్య విద్యార్థులకు సీట్లు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ప్రతి పది మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు కేవలం 2-3 పీజీ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రైవేట్ ఉద్యోగం చేస్తే కేవలం రూ.40-50వేల వేతనం మాత్రమే రావడంతో చాలా మంది విద్యార్థులు పీజీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్ఎంసీ సైతం సీట్లు పెంచాలనే ధోరణితో మాత్రమే ముందుకెళ్తున్నదని, కనీస మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉందా..? అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని వైద్య వర్గాలు మండిపడుతున్నాయి. ఫ్యాకల్టీ లేకపోవడంతో అకడమిక్ పర్యవేక్షణ, పాఠ్యాంశాల ప్లానింగ్, పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నదని వాపోతున్నాయి.