వరంగల్, ఫిబ్రవరి 17(నమస్తేతెలంగాణ) : కారణజన్ముడు, అభివృద్ధి సూరీడు, తెలంగాణ ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గులాబీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు, అన్నదానాలు చేశారు. మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టి అభిమానం చాటుకున్నారు. వనదేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మ సన్నిధిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సమ్మక్క గద్దె వద్ద మంత్రి ఎర్రబెల్లి కేక్ కట్ చేయగా, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్ ఎత్తు బంగారం(62 కిలోలు) తల్లులకు సమర్పించారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కేక్‌కట్ చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఫుట్‌పాత్‌లపై పడుకున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా ఆరెపల్లిలోని అయ్యప్పస్వామి హరిహర క్షేత్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వాణి దంపతులు మహా మృత్యుంజయ సహిత చండీ హోమంలో పాల్గొని పూజలు చేశారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. నర్సంపేటలోని మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. సంగెం, గీసుగొండ మండలాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పండ్లు పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సర్వమత ప్రార్థనలు చేసి, కేక్ కట్ చేశారు. గౌతమి కళాశాలలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు కేక్ కట్ చేసి, మొక్క నాటారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరిపెడలోని మాకుల బాలజీ ఆలయంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పూజలు చేశారు. జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. జనగామ నియోజకవర్గంలోని గిర్నిగడ్డ ఏరియాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కలు నాటారు.