హనుమకొండ, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తున్నది. శాస్త్రీయత లేకుండా, స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ జరుగుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సొంత నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు మహబూబాబాద్ జిల్లా గార్ల, డోర్నకల్‌లోని గిరిజన ప్రాంతాల భూములు బీడులా మారేలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో అనుసంధానమైన పాలేరు రిజర్వాయర్‌కు అదనంగా మున్నేరు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వందల కోట్లతో డ్యామ్ కట్టి ఆ లాభాలను పొందడం, గిరిజన ప్రాంతానికి చెందిన నీటిని తరలించడం.. రెండు రకాల ప్రయోజనాలతో మంత్రి అధికార బలం చూపిస్తున్నారు. ఇందుకోసం గార్ల మండలం దుబ్బగూడెం కింది భాగంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి గత ఏడాది మే నెలలోనే రూ.162.54 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ అయ్యింది. ఈ ఉత్తర్వులను గుట్టుగా ఉంచి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి సొంత నిర్ణయాలతో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ ప్రాంత రైతులు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అనేక వాగులు, ఉపనదుల సమాహారం మున్నేరు. పాకాల వట్టేరు, బయ్యారం అలిగేరు కలిసి మున్నేరుగా మారిన ములనూరు సమీపంలో ప్రాజెక్టు నిర్మిస్తే ఖమ్మం జిల్లాలోని కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, మహబూబాబాద్ గార్ల, డోర్నకల్ మండలాలకు సాగు, తాగునీరు అవసరాలు తీరుతాయి. మున్నేరు ప్రాజెక్టు కోసం 35 రెవెన్యూ గ్రామాల ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో చంద్రగిరి ప్రాజెక్టు, రెండేర్ల గడ్డ ప్రాజెక్టుగా పిలిచేవారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును అప్పటి బీఆర్ఎస్ ఉద్యమాలతో 2009 జూన్ 24న అప్పటి ప్రభుత్వం మున్నేరు ప్రాజెక్టు కోసం రూ.131.67 కోట్లు మంజూరు చేసింది.
ఆరు మండలాల పరిధిలో 30,406 ఎకరాలకు సాగునీరు, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసేలా ప్రాజెక్టును ప్రతిపాదించారు. బయ్యారం ఉకు, తెలంగాణ హ కు నినాదంతో బీఆర్ఎస్ ఉద్యమంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఖనిజ తరలింపు ఒప్పందాన్ని రద్దుచేసింది. ఆ తర్వాత మున్నేరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రూపొందించింది. మున్నేరు ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టును దీని పరిధిలోకి తెచ్చింది. 2016 ఫిబ్రవరి 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రోళ్లపాడు, బయ్యారం, గార్ల చెరువులకు నీళ్లందించే లక్ష్యంతో పనులు చేపట్టింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మారింది.
మున్నేరు ప్రాజెక్టుతో 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్‌కు తరలిస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం దిగువన ఉన్న చెక్ డ్యాములు, ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద చుక్క నీరు ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గార్ల, డోర్నకల్ ప్రాంతంలోని భూములకు సాగునీరు వసతి కల్పించకుండా ఇక్కడి నీటిని ఎప్పుడూ పరిశీలనలో లేని పాలేరు ప్రాంతానికి తరలించే ప్రక్రియపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు పరిధిలోని కాల్వల కోసం 350 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. అటవీ చట్టం ప్రకారం గ్రామసభలు పెట్టి రైతులు అంగీకరించాకే ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
గార్ల మండలం దుబ్బగూడెం వద్ద ఉన్న మున్నేరు నుంచి 20 మీటర్ల లోతు కాలువ తవ్వుతున్నారు. దీంతో ఇక్కడ నీళ్లు అడుగంటి పోతాయని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుతో నీరు తరలించి గార్ల, బయ్యారం, డోర్నకల్, కురవి మండలాల్లోని భూ ములకు నీరందించాలని చూస్తే.. కాంగ్రెస్ ప్రభు త్వం తమ భూములను ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బయ్యారం చెరువుకు నీటిని తరలిస్తే అక్కడి నుంచి మరో 15 చిన్న చెరువులు, కుంటలకు నీరు చేరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని కోరుతున్నారు.
మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.162.54 కోట్లు కేటాయిస్తూ 2025 మే 17న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 98ని జారీ చేసింది. మున్నేరు-పాలేరు లింకు కెనాల్ అని ఉత్తర్వులో పేర్కొన్నది. మున్నేరు ప్రాజెక్టుతో నీటిని నేరుగా పాలేరు జలాశయానికి పంపించడం కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. గార్ల మండలం దుబ్బగూడెం కింది భాగంలో ప్రాజెక్టు నిర్మించి ఏడాది పొడవునా ఇక్కడి నీటిని డోర్నకల్ రైల్వే గేటు సమీపంలోని సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్‌కు అనుసంధానం చేసి ఏడాది పొడవునా పాలేరు రిజర్వాయర్‌కు తరలించేలా ప్రణాళిక రూపొందించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మున్నేరు వాగుపై డ్యామ్ కట్టి కాలువతో నీళ్లను తీసుకుపోతే గార్ల మండలంలో పంటలు లేకుండా పోతయి. ఆరు నెలలు నీళ్లు నిల్వ ఉండి పంటలు బాగా పండుతున్నయి. డ్యామ్ కట్టి నీళ్లు తీసుకుపోతే మా ఏరియాలో పంటలకు నీరు ఉండదు. ప్రభుత్వం అందరి కోసం ఆలోచించాలి.
– గంగావత్ లక్ష్మణ్‌నాయక్, రైతు, గార్ల
గార్ల మండలం మున్నేరు వాగుపై డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం. కాలువల కోసం రైతులు 350 ఎకరాల భూమిని కోల్పోతారు. నీళ్లు ఇతర ప్రాంతాలకు పోతే ఇకడి రైతులు ఎలా బతకాలి?. మా నీళ్లు మాకు కాకుండా చేస్తే ఊరుకునేది లేదు. రైతులమంతా కలిసి అడ్డుకుంటం. మా నీళ్లు మాకే కావాలి.
– ఆగాల రామారావు, రైతు, గార్ల,