పర్వతారోహణ సాహసం. ఆ అద్భుతాన్ని అంతే ఇదిగా చిత్రీకరించడం మహాద్భుతం! పర్వతారోహకుడు శిఖరాగ్రాన్ని చేరి రికార్డులకెక్కినట్టే.. ఈ సాహస యాత్ర చిత్రీకరణకూ ఓ విజయం దక్కింది. మృత్యుదారిలో మంచు తుఫానులు కాచుకుని తీసిన డాక్యుమెంటరీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కు ఎంపికైంది. టీనేజ్ దర్శకుడు, పాతికేండ్లు కూడా దాటని సాంకేతిక బృందం సృష్టించిన సాహస యాత్రా దర్శనం ‘రియో: ది డేంజరస్ పీక్’ లోకల్ టాలెంట్‌కి ఓ మచ్చుతునక. డైరెక్టర్ శౌర్య శ్రీకీరే చెప్పిన డాక్యుమెంటరీ విశేషాలివి.
మాది హైదరాబాద్. నాకు సినిమాలంటే ఇష్టం. నటించాలని కోరిక. పద్నాలుగేళ్ల వయసులో థియేటర్ యాక్టింగ్, డైరెక్షన్ నేర్చుకున్నాను. చాలా సినిమాల ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘కుదిరామ్ బోస్’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. సినిమాకు పేరొచ్చినా రిలీజ్ కాకపోవడంతో ఆ తర్వాత అవకాశాలు రాలేదు. బీసీఏ చదవడానికి బెంగళూరుకు వెళ్లాను. అయితే ‘ఇది నాకు సరైంది కాదు’ అనిపించింది. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాను. సెయింట్ జోసఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్లో చేరాను. ప్రాక్టికల్‌గా నాకు ఎంతొచ్చు తెలుసుకుందామని డాక్యుమెంటరీ తీయాలనుకున్నాను. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను.
శిఖరం వైపు చూపు హిమాలయ పర్వత శ్రేణుల్లో రియో పర్గిల్ పర్వతం ఉంది. సముద్రమట్టానికి 6816 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని శిఖరానికి చేరుకోవాలంటే.. ఏటవాలు ప్రయాణం సాధ్యం కాదు. ఇండో టిబెట్ సరిహద్దులో ఉండటం వల్ల అక్కడ సైనిక ఆంక్షలూ ఉంటాయి. ఈ కారణాల వల్ల ఈ పర్వతారోహణకు పౌరులకు అనుమతి లేదు. ఆర్మీ అధికారులు మాత్రమే దానిని అధిరోహించారు. చిట్టచివరిగా 1971లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు ఈ శిఖరానికి చేరుకున్నారు. ఈ గిరిని అధిరోహించడానికి తెలంగాణ పర్వతారోహకుడు యశ్వంత్ నాయక్‌కు ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ అనుమతి వచ్చింది. అదే సమయంలో నేను డాక్యుమెంటరీ ప్రయత్నాల్లో ఉన్నాను. ఇంతకుముందు రియో పర్వతం గురించి డాక్యుమెంటరీలు అందుబాటులో లేవు. యశ్వంత్ నాయక్ సాహసాన్ని చిత్రీకరించాలనుకున్నా.
సాహస మార్గంలో రియో పైకి చేరాలంటే అనేక పర్వతాలు ఎక్కాలి, దిగాలి. అందుకే ‘రియో: ద డేంజరస్ పీక్ డాక్యుమెంటరీ’ని బేస్ క్యాంప్ నుంచి కాకుండా ‘నాకో’ అనే ఊరు నుంచి మొదలుపెట్టాం. పర్వతారోహకులు ఆ ఊరిలో ఉన్న ‘కుంజుం మాత’ ఆలయంలో పూజలు చేసి ఒక్కో క్యాంప్ దాటుకుంటూ ముందుకుసాగుతారు. మా డాక్యుమెంటరీ చిత్రీకరణ, స్క్రీన్‌ప్లే కూడా అలాగే ఉంటుంది. యశ్వంత్ నాయక్ రియో శిఖరాన్ని చేరుకునే ప్రయాణం ఎంత భయంకరంగా ఉంటుంది. దారిలో ఎదురయ్యే సవాళ్లు, వాతావరణ సమస్యలు ఇక్కడ చూపించాం. ఇందుకోసం మేము కూడా యశ్వంత్ నాయక్‌తో కలిసే రియో గిరి బాట పట్టాం.
మంచు తుఫానులో యశ్వంత్ నాయక్ పర్వతారోహణ ఆగస్టులో జరిగింది. మా చిత్రీకరణ కూడా అప్పుడే జరిగింది. పర్వతారోహకుడికి గైడ్, సహాయకులు ఉన్నట్టే మేమూ.. గైడ్లు, ఇద్దరు వంటవాళ్లు, డ్రైవర్లు, సామాన్లు మోసే షెర్పాల సాయం తీసుకున్నాం. అక్కడి చలి వాతావరణంలో కెమెరాతో చిత్రీకరించడం సాహసమే! అందుకే, అంతటి సాహసం చేయగలిగిన, స్థానికుడైన అక్షర్ జైన్‌ని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాం. తనకు స్థానిక పరిస్థితులపై అవగాహన, పర్వతాలెక్కిన అనుభవం ఉంది. బేస్ క్యాంప్ నుంచి శిఖరానికి చేరుకునేప్పుడు మంచు తుఫాను వచ్చింది. ముందుకు సాగలేం, వెనక్కి రాలేం. ఏమీ చేయలేక ఆరు రోజులపాటు ఉన్నచోటే ఆగిపోయాం. వారం తర్వాత వాతావరణంలో మార్పు వచ్చింది. యశ్వంత్ యాత్ర మొదలైంది. మా షూటింగ్ మొదలైంది. సమిట్ క్యాంప్ దగ్గర డ్రోన్‌ని ఎగురవేయడానికి అనుమతి లేదు. సరిహద్దు కావడంతో ఆంక్షలు ఉన్నాయి. యశ్వంత్ హెల్మెట్‌కి కెమెరా ఫిక్స్ చేసి చిత్రీకరించాం. చివరి దృశ్యం ఐఫోన్‌తో చిత్రీకరించాం.
అందరి విజయం
ఈ డాక్యుమెంటరీ కోసం ఇప్పటి వరకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాం. అసాధారణ వాతావరణంలో కెమెరాలు, డ్రోన్, బ్యాటరీలు వాడటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యింది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టాం. ఈ డాక్యుమెంటరీ కోసం యాభై మంది వరకు కలిసి పని చేశాం. మేమంతా క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించాం. ఈ డాక్యుమెంటరీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నప్పుడే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ గురించి తెలిసింది. ఈ ఫెస్టివల్‌కు మా డాక్యుమెంటరీ పంపాలని కాలంతో పరుగులు తీశాం. పొద్దున పరీక్షలు రాసి, మధ్యాహ్నం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశాను. సుధా శ్రీనివాస్ పి. మంచి సంగీతం అందించాడు. చందన్ సాయి మాదినేని ఎడిటింగ్ బాగా వచ్చింది. చివరికి మా కష్టం ఫలించింది. ముప్పై నిమిషాల మా డాక్యుమెంటరీ షార్ట్ డాక్యుమెంటరీ కేటగిరిలో ఎంపికైంది
-నాగవర్ధన్ రాయల