నీలగిరి, జనవరి 10: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 4.6 కేజీల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నల్లగొండ ఐటీ టవర్ సమీపంలోని సత్యా టీ హబ్ వద్ద కొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నల్లగొండ రూరల్ ఎస్సై సైదాబాబు, ఈగల్ ఫోర్స్ సహకారంతో అక్కడకు వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న సయ్యద్ మాజిద్, మొహ్మద్ సోహైల్ అలీ (సోహైల్) అనే ఇద్దరు వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.
తనిఖీలో వారి వద్ద 4.6 కేజీల గంజాయి బయటపడటంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిద్దరూ హైదరాబాద్‌లో ఒకే కాలనీలో ఉంటున్న స్నేహితులన్నారు. రెండు సంవత్సరాలుగా వారు తమ స్నేహితులతో కలిసి గంజాయి సేవించేవారన్నారు. గంజాయి విక్రయిస్తే డబ్బుతోపాటు ఆర్థిక ఇబ్బందులు తీరతాయని భావించి నాలుగు నెలల నుంచి ఒడిశాలో గంజాయి అమ్మే శివారెడ్డి (ప్లాబో ఎసోబార్) అనే వ్యక్తిని (ఇన్ స్టాగ్రామ్ ద్వారా) పరిచయం చేసుకొని పలుమార్లు గంజా యి తెచ్చినట్లు తెలిపారు. ఒడిశాలో కిలో గంజాయిని రూ. 3 వేలకు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వారికి రూ. 500 చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం వారిద్దరూ రైలులో హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్లి రూ. రూ.13,500 నగదు చెల్లించి 4.6 కిలోల గంజాయి కొనుగోలు చేసి నల్లగొండకు తెచ్చినట్లు తెలిపారు. సమావేశంలో నల్లగొండ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్సై సైదాబాబు తదితరులు ఉన్నారు.
బస్టాండ్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు
బస్టాండ్‌లోని ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీగా( మండ ఆధినారాయణ), పసుపులేటి రేణుక అనే ఇద్దరు వ్యక్తులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి రోడ్ల మీద తిరిగే అనాథ పిల్లలకు షెల్టర్ ఇచ్చి వారితో బస్టాండ్ల వద్ద, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చోరీలు చేయించేవారన్నారు. ఇటీవల మండ ఆధినారాయణ ఒక కారును కొనుగోలు చేసి రేణుక పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. కారు డ్రైవరుగా రవి అనే వ్యక్తిని నియమించి, మాదిగ అరవింద్ అనే మరో వ్యక్తిని గ్యాంగ్‌లో చేర్చుకుని హైదరాబాద్ చుట్టుపక్కల బస్టాండ్లలో చోరీలకు పాల్పడేవారన్నారు. గత జూన్ మూడో వారంలో నల్లగొండలో రూ. 80 వేలు, డిసెంబర్ రెండో వారంలో రూ.60 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు. అదే తరహాలో శనివారం రేణుక, అరవింద్ నల్లగొండ బస్టాండ్‌లో చోరీకి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అదినారాయణ, రవి పారిపోగా రేణుక, అరవింద్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టూ టౌన్ సరిల్ ఇన్స్పెక్టర్ రాఘవ రావు, టూ టౌన్ ఎస్సై సైదులు సిబ్బంది సాగర్ల శంకర్, లావూరి బాలకోటి, షకీల్ తదితరులు ఉన్నారు.