న్యూఢిల్లీ, జనవరి 10: ఐ-ప్యాక్ కార్యాలయాలపై తాము దాడులు నిర్వహిస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ విధులకు ఆటంకం కల్పించారని ఆరోపిస్తూ జనవరి 8న జరిగిన సంఘటనలపై సీబీఐ దర్యాప్తును కోరుతూ ఈడీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర వాదనను వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈడీ తన పిటిషన్ దాఖలు చేసింది. కోల్కతాలో గురువారం జరిగిన ఘటనలను బల ప్రదర్శనగా ఈడీ అభివర్ణించింది.
ఈసీకి మమత లేఖాస్త్రం
ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ ద్వారా సాధారణ పౌరులను ఎన్నికల సంఘం వేధిస్తోందని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు మమత శనివారం ఓ లేఖ సంధించారు. సర్ కార్యక్రమం కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రంలో 77 మంది చనిపోయారని ఆమె ఆరోపించారు.