Hyderabad Metro | హైదరాబాద్, మే 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్ శంకర్ రామన్ స్వయంగా ప్రకటించారు. 2026 తర్వాత విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ స్కీమ్ కారణంగానే హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. ‘ఫ్రీ’ బస్సు స్కీమ్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఫ్రీ’ బస్సు స్కీమ్‌తో తెలంగాణ ఆర్టీసీ కూడా దివాళా తీసే దుస్థితి రావొచ్చని హెచ్చరించారు. ఈ మేరకు ఇంగ్లీష్ వార్తాఛానల్ ‘బిజినెస్ టుడే’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.