ఖలీల్‌వాడి, మే 12 : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్(సర్) ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ డిజిటల్ రూపంలో చేపడుతున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదును బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించింది.
ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ నమోదుకు సమన్వయ కర్తను నియమించబోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు త్వరలో శిక్షణా కార్యక్రమాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జిలను కేసీఆర్ నియమించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత నియమించారు.