‘పరమాన్నం వండిపెట్టినా పందులు వ్యర్థాలనే వెతుక్కుంటాయి’ అనేది వాస్తవ మాట. మనసు పెట్టి చూస్తే తెలంగాణలో ఇపుడు జరిగింది కూడా ఇదే. ‘సారు’ మనకెంత మంచి చేసినా, రాష్ర్టానికెంత సంక్షేమం అందించినా తెలంగాణ చిన్న రాష్ట్రమైనా, ప్రపంచానికి పరిచయం చేసినా కొంతమంది ఆ మహానుభావునిలో లేని చెడును వెతుకుతున్నారు. లేనిది ఉన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నా ఆయననే కేంద్రంగా చేసుకొని రాష్ట్ర ప్రయోజనాలను సైతం వదిలేసి అవాకులు, చవాకులు పేలుతున్నారు. తెలంగాణలో ఓవైపు లా అండ్ ఆర్డర్ మంటగలిసిపోయి పట్టపగలే బొడ్లో గన్నులు పెట్టుకుని ఆభరణాల షాపుల్లో చొరబడి దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. తమకు దొరికినంత దోచుకెళ్తున్నారు.
తాజాగా ఒక డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యను నగరం నడిబొడ్డున ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్‌లోనే కొందరు వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. 17 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచార కేసు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. బాలికను ట్రాప్ చేసి పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా భగీరథ్‌పై పోలీసులు కేసు కట్టేందుకు నిరాకరిస్తే ఆ బాలిక తల్లిదండ్రులు ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలిసిందే. కానీ ఇంతవరకు ఇందుకు బాధ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం శోచనీయం.
బాధిత బాలిక కుటుంబం బండి భగీరథ్‌పై కేసు పెట్టేందుకు మూడు నెలలు పట్టిందంటే మనమెంత భయానక, అమానుష పరిస్థితుల్లో ఉన్నామన్నది కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయం వల్ల బట్టబయలైంది. ఆయా ఘటనలను పరిశీలిస్తే తెలంగాణలో శాంతిభద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రేపిస్టుల పట్ల కఠినవైఖరి అవలంబించటం చూశాం. మహిళలకు గత ప్రభుత్వం రక్షణగా ఉండె. ఇప్పుడు సామాన్యుల పరిస్థితి చూస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ప్రజల గొంతుకైన ప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎదిరిస్తే దాడులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీగా వ్యవహరిస్తున్నారని అనటానికి సాక్ష్యం..దేశంలో అత్యధిక క్రైమ్ రేట్ తెలంగాణలోనే అని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదిక చెప్తున్నది.
రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారని. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మరీ దారుణంగా ఉన్నాయి. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, బైక్ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు యువత వెళ్తున్నారని ఇటీవల వరంగల్‌లో యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తమ ప్రభుత్వ ప్రజాపాలన గురించి పలికిన మాటలే నిదర్శనం.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా, బందూకుల్లేని రాజ్యంగా విరాజిల్లింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగింది. రైతులకు భరోసాగా రైతుబంధు పథకం కింద ఎకరాకు ఆరు వేలు వంతున నేరుగా రైతు ఖాతాలో వచ్చిపడేవి. పక్కా భరోసాగా రైతు బీమా అందించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఒక్క గింజ కూడా ఆపకుండా కొనుగోలు చేసేవారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలే లేకుండె. ఏ సమస్య లేదా డిమాండ్ మీద అయినా రైతులు ధర్నాలు, రాస్తారోకోలకు తావివ్వలేదు.
రేవంత్ అండ్ బ్రదర్స్ బకాసురుల్లా ఒక్కొక్కటి అన్నీ బుక్కవెడుతున్నారు. ఇసుక, బొగ్గు, చివరికి బూడిదను కూడా వదలకుండా బుక్కుతున్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల సోయి తప్ప అభివృద్ధి మాటే లేదు. రైతులు, అవ్వ, తాత, ఆడబిడ్డలకు ఇచ్చేందుకు పైసల్ లేవంటున్న రేవంత్..రాహుల్ ఖాతాలో వేసేందుకు మాత్రం ఢిల్లీకి పోతున్నడు.
ఈ పరిస్థితులను చూస్తే..తెలంగాణ పురోగమిస్తున్నదా? తిరోగమిస్తున్నదా? అని ప్రజలకు సందేహం కలుగుతున్నది. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ కుటుంబ, వ్యక్తి వ్యక్తిగత హననానికి పాల్పడకుండా రాష్ట్ర ప్రయోజనాలపై, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి. మౌంట్ ఎవరెస్ట్ లాంటి కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపించే ప్రయత్నాలను ఇకనుంచి ప్రజలు ఉపేక్షించరు. నాడు తెలంగాణ సాధన కోసం సాగరహారం, మిలియన్ మార్చ్, సడక్ బంద్ చేసిన ఉద్యమస్ఫూర్తితో ఈ దగాకోరు కుమ్మక్కు రాజకీయ నాయకుల భరతం పట్టుడు ఖాయం.
– ఆర్ఆర్ఆర్