మైనర్‌పై లైంగికదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు కేంద్రమంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ మేరకు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ నేతలు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చట్టం బండికి చుట్టమా, బండిని బర్తరఫ్ చేయాలి, పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా? అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు నగరంలోని ప్రధాన కూడళ్లు, సెంటర్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల బండి సంజయ్, భగీరథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
– సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
తిలక్‌నగర్‌లో కేవీపీఎస్ నేతల ధర్నా
గోల్నాక, మే 12: కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తను కుమారుడు ఏ తప్పు చేయనప్పడు సాయి భగీరథ్‌ను ఎందుకు దాచిపెడుతున్నావని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర నాయకుడు మహేందర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అంబర్‌పేట తిలక్‌నగర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బాధితురాలికి తగిన న్యాయం జరిగేవరకు కేవీపీఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్యా నగర కార్యదర్శి వై.వరలక్ష్మి, కేవీపీఎస్ నాయకులు సుబ్బారావు, రామలు, నాగేందర్, డీ రాములు, కురుమయ్య, నాగులు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి
జిన్నారం(అమీన్పూర్), మే 12 : కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినేట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నాయిని లలిత డిమాండ్ చేశారు. మంగళవారం బీరంగూడ ప్రధాన రహదారిపై ఆ సంఘం మహిళలు ధర్నా చేపట్టారు. అనంతరం బండి సంజయ్, బండి భగీరథ దిష్టి బొమ్మలను దహనం చేశారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. మహిళా నేతలు సునీత, లావణ్య, సరస్వతి, మల్లేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని పార్టీల విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్వీ నాయకుడు తుంగబాలు, చిత్రంలో పీవోడబ్లూ సంధ్య, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు.
పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

ఉప్పల్, మే 12 : ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో మంగళవారం బండి భగీరథ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ.. మైనర్‌పై లైంగికదాడి కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి నాలుగురోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణమని, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహహరిస్తున్నారని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

Hyd10
గోల్నాక, మే 12 మైనర్‌పై లైంగిక దాడి ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై నాలుగు రోజులైన ఎందుకు అరెస్ట్ చేయలేదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలసి పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.ఈ దారుణ ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్‌కుమార్‌గౌడ్, మల్లికార్జున్ యాదవ్, సిద్ధార్థ్ ముదిరాజ్, బద్దుల ఓం ప్రకాశ్‌యాదవ్, సురేష్‌గౌడ్, చంద్రమోహన్, మోర శ్రీరాములు ముదిరాజ్, చంద్రమోహన్‌తో పాటు పెద్ద ఎత్తున మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలి
హిమాయత్‌నగర్, మే12: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వీ సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పలు మహిళా సంఘాల నేతలు జీ ఝాన్సీ, ఎస్.వరలక్ష్మి, స్వరూప, లక్ష్మి, జీ భారతి, హేమలత, బీ జ్యోతి పాల్గొన్నారు.
అరెస్టు చేయకుంటే ఉద్యమం తప్పదు
జవహర్‌నగర్, మే 12: కేంద్రమంత్రిగా బండి సంజయ్ కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని పీవోడబ్ల్యూ (విమూక్తి) పెర్క సునీత, ఆడజన సమాఖ్య వ్యవస్థపకురాలు ధనలక్ష్మి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక తుమ్మరాణి హితవు పలికారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజా సంఘాల మహిళలు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. భగీరథ్‌ను అరెస్టు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి
హిమాయత్‌నగర్, మే12: పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితుడు సాయి భగీరథ్ తండ్రి సంజయ్ కేంద్రమంత్రి కావడంతో ఈ కేసు నుంచి సాయి భగీరథ్ తప్పించేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జెఎన్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవేందర్, నేతలు పి.మోహన్‌రావు, చిప్పరి సుబ్బారావు పాల్గొన్నారు.