పేద విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు సర్కారు స్టడీ సర్కిళ్లను తెచ్చింది. ఆదిలాబాద్‌లో రూ.3.75 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ వేలాది మందికి వరంలా మారింది. ప్రైవేట్‌కు దీటుగా శిక్షణతో నిరుద్యోగులకు భవిష్యత్తునిస్తున్నది. పేద, మధ్యతరగతి విద్యార్థులు కొలువులు కొట్టేందుకు దోహద పడుతున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏడేండ్లలో 197 మంది ప్రభుత్వ, 500 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తాజా ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో ఈ స్టడీ సర్కిల్ నిరుద్యోగ యువతీయువకులకు మార్గదర్శనం చేయనున్నది.
ఆదిలాబాద్, మార్చి 11( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ లాంటి పట్టణాలకు పోయి వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునే వారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా ఉద్యోగాలు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరేవారు. అక్కడ సరైన శిక్షణ లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో వెలువరించే అరకొర ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉండడంతో జిల్లాలోని నిరుద్యోగులకు సర్కారు కొలువులు దక్కేవి కావు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో రాణించే విధంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు గానూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నది. ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని రూ. 3.75 కోట్లతో నిర్మించారు. అన్ని హంగులతో నిర్మించిన ఈ భవనంలో ఏసీ సౌకర్యం కల్పించడం తోపాటు విశాలమైన తరగతి గదులు, ఫర్నిచర్‌ను సమకూర్చారు. వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వారితో విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి లైబ్రరీని ఏర్పాటు చేసి అందులో యూపీఎస్సీతో పాటు గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఉద్యోగాలకు ప్రిపేరయ్యేలా పుస్తకాలను అందుబాటులో ఉం చారు. విద్యార్థులు సర్కిల్ లైబ్రరీలో రోజు 6గంటల పాటు సమయం గడుపుతున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలను సాధిస్తున్నారు.
ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 1868 మంది విద్యార్థులు వివిధ ఉద్యోగాలకు శిక్షణ పొందగా 197 మంది నిరుద్యోగులు వివిధ కొలువులు సాధించారు. ఒకరు ఎస్సై, మరొకరు డిప్యూటీ కలెక్టర్, 60 మంది పోలీస్ కానిస్టేబుల్, ఐదుగురు బ్యాంకు క్లర్క్, ఆరుగురు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఐదుగురు వీఆర్వో, 43 మంది పంచాయతీ కార్యదర్శి, ఒకరు జైలు వార్డెన్, 20 మంది గురుకుల టీచర్, 35 మంది టీఆర్టీ,డీఎస్సీ, 8 మంది గ్రూప్-4, 9 మంది ఆర్ఆర్బీ, ఒకరు సింగరేణి, ఇద్దరు పోస్ట్‌మాన్, ఇద్దరు ఆర్మీ, మరికొందరు ఇతర ఉద్యోగాలు పొందారు. వీరితో పాటు 500 మంది వరకు ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఉద్యోగాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 3919 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇందులో 25 నుంచి 30 శాతం ఉద్యోగాలు తమవద్ద శిక్షణ పొందిన విద్యార్థులకు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్లో తీసుకున్న శిక్షణతో తాము గ్యారంటీగా ఉద్యోగాలు సాధిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులకు ఉత్తమ శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్యోగాలను ఎక్కువ సంఖ్యలో సాధిస్తాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మా వద్ద శిక్షణ పొందిన 197 మంది విద్యార్థులు ప్రభుత్వ కొలువులు సాధించారు. రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సంపాదించిన వారు 10 మంది ఉన్నారు. మరో 500 మందికి ప్రైవేట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయి. యూపీఎస్సీ మొదలుకొని అన్ని ఉద్యోగాలకు అవసరమైన పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఎక్కువ సమయం పుస్తకాలు చదువుకునే ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్
నేను ఎంఏ (తెలుగు), బీఎడ్ పూర్తి చేశాను. టెట్, డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. బీసీ స్టడీ సర్కిల్లో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఏడాది నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. లైబ్రరీలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండడంతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వస్తున్నారు. వారంతా ఉద్యోగాలు సాధించే అవకాశాలుంటాయి. ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు, ఇక్కడ కోచింగ్ తీసుకుంటే విజయం సాధించవచ్చు.- ఏ అనిత, విద్యార్థిని, ఆదిలాబాద్ పేద విద్యార్థులకు వరం మాది తాంసి మండలం వడ్డాడి.
బీఏ పూర్తి చేసిన నేను కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకున్నా. మాలాంటి పేద విద్యార్థులకు ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయడం వరం. నిపుణలతో శిక్షణ ఇవ్వడంతో నాకు ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలిగింది. 60 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు వివిధ అంశాల్లో కోచింగ్ ఇస్తారు. ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ చాలా బాగుంది. తెలంగాణ చరిత్ర, అర్థమెటిక్, ఇంగ్లిష్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలు పోటీ పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడుతాయి.
-బీ సాయిరాం, విద్యార్థి, తాంసి, ఆదిలాబాద్ జిల్లా
నేను ఇటీవల పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు 60 రోజుల శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్ నుంచి వివిధ సబ్జెక్టుల ఫ్యాకల్టీలు వచ్చి మాకు కోచింగ్ ఇచ్చారు. ఇండియన్ పాలిటీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జాగ్రఫీ, అర్థమెటిక్ లాంటి అంశాలపై పట్టు సాధించా. శిక్షణ సమయంలో రోజు, వారం, నెలల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. క్రమశిక్షణ, సమయపాలనతో పాటు నిర్వాహకుల పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. స్టడీ సర్కిల్ అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలకు సిద్ధమయ్యే అవకాశం లభించింది. – దీపక్, రాంనగర్, ఆదిలాబాద్
డిగ్రీ చదువుకున్న నేను ఆదిలా బాద్ బీసీ స్టడీ సర్కిల్లో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం రెండు నెలల శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు మెటీ రియల్ను కూడా ఇచ్చారు. ఈ కోచింగ్‌లో అర్థమెటిక్, ఇంగ్లి ష్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ లాంటి అంశాల్లో పట్టు సాధించాను. ఫ్యాకల్టీలు వివిధ విషయాలను చక్కగా బోధిస్తారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండడమే కాకుండా చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఈసారి ఉద్యోగం కచ్చితంగా సాధిస్తాను. చదువు విషయంలో మా డైరెక్టర్ ప్రవీణ్ సార్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు.
-ఎ.సరిత, విద్యార్థిని, ఆదిలాబాద్