హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కుంటుబడింది. గతంతో పోల్చుకుంటే సగానికి పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో టీజీ ఐపాస్ ద్వారా కేవలం 2,900 పరిశ్రమలకు మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.18,600 కోట్లు మాత్రమే. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్తున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం కాగితాల (ఎంవోయూల)కే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానంలో సులభంగా అనుమతులు జారీ చేసేందుకు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీజీ ఐపాస్) పేరుతో సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఆన్లైన్లో ఒకే దరఖాస్తుతో నిర్ణీత గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరు కావడమే ఈ విధానం ప్రత్యేకత. విప్లవాత్మకమైన ఈ విధానం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్కసారిగా పెట్టుబడులు ఊపందుకున్నాయి.
2014-15 నుంచి ఇప్పటివరకు మొత్తం 28,078 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. వాటి ద్వారా రూ.3.03 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు, 19 లక్షల పైచిలుకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో 2014-15 నుంచి 2023-24 వరకు ఏటా సగటున 2,800 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. 2021-22లో రికార్డు స్థాయిలో ఏకంగా 4 వేల పరిశ్రమలకు అనుమతులివ్వడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ అనుమతుల సంఖ్య సగానికి పడిపోయింది. 2024-25లో కేవలం 2,050 పరిశ్రమలకు, 2025-26లో ఇప్పటివరకు 915 పరిశ్రమలకు మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ హయాంలో వచ్చిన 2,900 పరిశ్రమల్లో సూక్ష్మ పరిశ్రమలే 1,900లకుపైగా ఉన్నాయి. గత 20 నెలల్లో దావోస్, జపాన్, అమెరికా పర్యటనల సందర్భంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో పారిశ్రామిక రంగం ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ హయాంలో టీజీ ఐపాస్‌ను ప్రవేశపెట్టాక తొలి రెండేండ్లు మినహా ప్రతి సంవత్సరం 2,700కుపైగా అనుమతులు మంజూరయ్యాయి. 2019-20 నుంచి 2022-23 వరకు ఏటా 3 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులిచ్చారు. 2021-22లో రికార్డు స్థాయిలో ఏకంగా 4 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు జారీ అయ్యాయి. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభ సమయంలోనూ రాష్ర్టానికి పెట్టుబడుల వరద ఆగలేదు. అలా ఇప్పటివరకు రాష్ర్టానికి వచ్చిన మొత్తం రూ.3.03 లక్షల కోట్ల పెట్టుబడుల్లో రూ.18,600 కోట్లు మినహా మిగిలినవన్నీ బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక రంగం శరవేగంగా పరుగులు పెట్టిందనడానికి ఇదే నిదర్శనం.