కనిపించే ఐశ్వర్యాలన్నీ దొంగిలించడానికి వీలుంది. కానీ, జ్ఞానాన్ని, దానికి సంబంధించిన మంచి వాక్కును ఎవరూ దొంగిలించలేరు. బైబిలు ప్రకారం వాక్కుకు గొప్ప స్థానం ఉంది. వాక్కు దైవ తుల్యమైందని, దేవుని నోట వెలువడ్డ ఆ వాక్కుతోనే ఈ యావత్ విశ్వమూ పుట్టిందనీ, ఆ వాక్కే శరీరధారియైన క్రీస్తు రూపంగా మన మధ్య తిరుగుతూ ఉందని బైబిలు పేర్కొంది. ప్రభువు కూడా ఆహారం లేకుండానైనా ఉండొచ్చేమో తెలియదు కానీ, మనుష్య కుమారుని నోట వెలువడే మాట లేకుండా బతకడం కష్టం అని ఓ సందర్భంలో సాతానుకు చెబుతాడు.
ఓ సారి ఓ సైన్యాధిపతి తన ఇంట చావు బతుకుల్లో ఉన్న తన సేవకుడ్ని బతికించడానికి ప్రభువును ఆహ్వానిస్తూ, ‘స్వామీ మీరు నా ఇంటికి వచ్చేంతటి అర్హుడను కాను. కాబట్టి మీరు ఇక్కడి నుంచే ఓ మాట పలికితే చాలు నా సేవకుడు బతుకుతాడ’ని ప్రభువు మాటలోని శక్తిమంతమైన జీవాన్ని నమ్మాడు. మరో సందర్భంలో సాక్షాత్ ప్రభువే ‘భూమ్యాకాశాలు నశించినా నశించొచ్చు గానీ నా వాక్కుకు అంతం లేదు. సజీవంగా ఎల్లప్పుడూ ఉంటుంది’ అని ప్రకటించడం విశేషం. ప్రభువు పలికే వాక్కు సత్యవంతం, జీవవంతం, కాంతిమంతం, శక్తిమంతం. అది బాధల్లో ఉన్నవారికి చల్లటి ఓదార్పు ఇస్తుంది. అనేకానేక రూపాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ లోకాన్ని నడిపిస్తున్నది.