దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలు అనే మాహాత్ముడి నానుడిని నిజం చేసి చూపిస్తోంది రాష్ట్ర సర్కారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు కనీసం గుర్తింపులేని గిరిజన గ్రామాలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును పొందుతూ ఆదర్శ గ్రామాలుగా పేరుతీసుకువస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సంసద్‌కు ఎంపిక చేసిన గ్రామాల్లో ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామం దేశ స్థాయిలోనే 35వ స్థానం పొందటం విశేషం.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు హైమన్‌డార్ఫ్ దంపతులకు ఆతిథ్యం ఇచ్చిన మార్లవాయి గ్రామం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నది. గతేడాది ఆదివాసీ సంస్కృతికి నిలువుటద్దంలా నిలిచిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజును పద్మశ్రీ వరించింది. ఈ యేడాది సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుందని భావించిన తెలంగాణ సర్కారు పల్లె ప్రగతి ద్వారా మార్లవాయి గ్రామాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా మార్చింది. పల్లె ప్రగతిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ గ్రామం దేశ స్థాయిలోనే 35వ ర్యాంకు సాధించడంపై ఆదివాసుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్నది. సీసీ రోడ్డు అద్దంలా మెరుస్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పచ్చదనంతో ఉట్టిపడుతున్నాయి. ప్రతి వీధితో సీసీ రోడ్లు ఉండగా.. డ్రెయినేజీలు వందశాతం పూర్తికావడంతో మురుగునీరు కనిపించదు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన భగీరథ నీరు అందుతుండగా.. గ్రామం అందనమైన పూలతోట మధ్య ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఆదివాసులు కలిసికట్టుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. కాగా.. రెండేళ్లుగా పల్లె ప్రగతి కార్యక్రమాలు వంద శాతం అమలవుతున్నాయి. ప్రకృతివనం, డంప్ యార్డు, శ్మశానవాటిక పూర్తి కాగా.. విద్యుత్ సమస్య కనిపించదు. పంచాయతీకి వస్తున్న నిధులను వినియోగించుకుంటూ పల్లె ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామం శివారులో ఉన్న రాగాపూర్ చెరువుని రూ.3 కోట్లతో ట్యాంకు బండ్‌గా మార్చడంతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
బోథ్, మార్చి 19 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకానికి(ఎస్ఏజీవై) ఎంపికైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో 12వ ర్యాంకు సాధించింది. అప్పటి ఎంపీ నగేశ్ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పార్లమెంట్, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేయించారు. రూ.24 లక్షలతో మరుగుదొడ్లు, రూ.3 లక్షలతో పంచాయతీ భవనం, రూ.2 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం, రూ.10 లక్షలతో తారు రోడ్డు, రూ.15 లక్షలతో బీటీ రోడ్డు, రూ.6 లక్షలతో శుద్ధ జలం ప్లాంటు, రూ.22 లక్షలతో రైతు వేదిక, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.4 లక్షలతో డంప్‌యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, రూ.7 లక్షలతో సీసీ రోడ్డు, రూ.6.50 లక్షలతో మురుగుకాలువలు నిర్మించారు. మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ అందిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఎస్ఏజీవై పథకానికి ఎంపిక చేసింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, అభివృద్ధి చేయడంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బోథ్, మార్చి 19 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని వజ్జర్ పంచాయతీ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబితాలో 92వ ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రూ.13 లక్షలతో పంచాయతీ భవనం, రూ.4 లక్షలతో డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్ర భవనాలు మరమ్మతు చేశారు. ప్రకృతి వనం ఆహ్లాదం పంచడంతోపాటు పచ్చదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సుమారు యాభై రకాల పనులు చేయిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ బాపురావ్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయిస్తున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మా మార్లవాయి ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంప్ యార్డు పనులు వంద శాతం పూర్తి చేశాం. అందరి సహకారంతోనే అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతోనే మా గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందుతున్నది.
– కనక ప్రతిభ, సర్పంచ్
మా గ్రామం ఆదర్శంగా నిలువడం సంతోషంగా ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ సంస్కృతి గుస్సాడీలకు కేంద్ర బిందువైన మార్లవాయి గతం తో పోలిస్తే చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణ వచ్చిన తరువాత మార్లవాయి గ్రామంలో సీసీ రోడ్లు అయ్యాయి. ప్రతి ఇంటికీ మంచినీరు అందుతున్నది. కరెంటు సమస్య లేదు. రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి.
అభివృద్ధిలో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాం. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో కావాల్సిన అభివృద్ధి పనులు చేయించా. సంసద్ పథకానికి గ్రామం ఎంపిక కావడంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో అవసరమైన పనులు చేయిస్తాం.
– పంద్రం సుగుణ, సర్పంచ్, పట్నాపూర్
మా ఊరికి రోడ్డు సమస్య తీరింది. పట్నాపూర్ నుంచి ఇన్కర్పల్లె వరకు బురద రోడ్డుతో అవస్థలు పడ్డాం. రూ.15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించడంతో ఏ కాలంలోనైనా ఊరికి తొందరగా చేరుకుంటున్నాం. మా పల్లెలో అవసరమున్న చోట సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో వర్షం పడినా ఇబ్బంది లేకుండా పోయింది.
– ఆడెం భీంరావు, ఇన్కర్పల్లె, గ్రామస్తుడు
గ్రామ పంచాయతీకి కేటాయిస్తున్న నిధులతో పనులు చేయిస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనం ఉపయోగంలోకి తీసుకొచ్చాం. డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్లు కట్టించాం. వైకుంఠధామం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పల్లె ప్రకృతి వనంతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాం.
– సిడాం భూంబాయి, సర్పంచ్, వజ్జర్
పల్లెలో అభివృద్ధి పనులతో సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. రోడ్లు బాగు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. రోడ్ల వెంబడి మొక్కలు నాటుతుండడంతో పచ్చదనం కనిపిస్తున్నది. పల్లె ప్రకృతి వనంతో గుట్టపైన చెట్లు పెంచడంతో పిల్లలు అక్కడికి పోయి సేద తీరుతున్నారు.
– జుగునక్ జంగుబాపు, గ్రామస్తుడు, వజ్జర్