నెక్కొండ, మే 17: మక్కలు, ధాన్యం కొనుగోలులో ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న రైతులు.. దీనికితోడు మండుతున్న ఎండలతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని కొనుగోలు కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. రైతుకు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. అలంకానిపేట గ్రామ రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు రెండు ఎకరాల్లో మక్కజొన్న, మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు. నెక్కొండ మండల కేంద్రంలో అధికారులు కేవలం ఒకే చోట మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దిగుబడులు పెరిగి మార్కెట్‌కు మక్కలు పోటెత్తడంతో రోజుల తరబడి మార్కెట్ గేట్లకు తాళాలు వేశారు.
ఈ క్రమంలో అలంకానిపేటకు చెందిన రైతు వెంకటేశ్వర్లు మక్కలను పదిహేను రోజుల క్రితం కాపులకనపర్తిలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తరలించాడు. మరోవైపు మూడు ఎకరాల్లో సాగుచేసిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకొచ్చాడు. రెండుచోట్ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో ఆదివారం కొనుగోలు కేంద్రంలో బస్తాల్లోకి ధాన్యాన్ని నింపుతుండగా రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు (60) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రానికి డాక్టర్‌ను తీసుకొచ్చినా అతడి ప్రాణాలు నిలువలేదు. అనంతరం పెద్ద వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని ఇంటికి తరలించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, కొనుగోలులో జాప్యంతో రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు హఠాన్మరణం చెందారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం విక్రయానికి వచ్చిన రైతు అక్కడే కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతదేహానికి బీఆర్ఎస్ నాయకులు, మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ సూరం రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ మాదాసు రవి, శ్రీనివాస్ నివాళులర్పించారు.
రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. రైతు హఠాన్మరణం సమాచారం తెలుసుకున్న ఆయన తీవ్రసంతాపం తెలిపారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. 45 డిగ్రీల ఎండలో కొనుగోలు కేంద్రాల్లో కాంటా కోసం రైతులు రాత్రింబవళ్లు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరీక్షిస్తూ ఎండలో అలసిపోయిన రైతు వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పంటల కొనుగోలులో జాప్యంపై నిత్యం ప్రతిపక్ష పార్టీలు, రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకుల చిల్లర దందాలు, అక్రమాలతోనే కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతున్నదని ధ్వజమెత్తారు. ధాన్యం తరలింపు, గోదాముల నిల్వపై స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు అవగాహన లేదని ఆరోపించారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.