వాషింగ్టన్, మే 17 : ఇరాన్‌కు చాలా క్లిష్టతరమైన సమయం రాబోతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడులను పునరుద్ధరిస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో యూఎస్ నేవీ అడ్మిరల్‌తో కలిసి ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. తుఫాన్‌తో అల్లకల్లోలంగా ఉన్న సమద్రంలో కొన్ని ఓడలు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌తో వీరిద్దరూ ఉన్నారు. ఆ చిత్రంలో ట్రంప్ కుడిచేయి పైకెత్తి చూపుడువేలుతో చూపిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం కన్పిస్తున్నది. అలాగే చిత్రంపై ‘తుఫాన్‌కు ముందు ఉండే ప్రశాంతత ఇది’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా, శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఫ్రెంచ్ బ్రాడ్‌కాస్టర్ బీఎఫ్ఎంటీవీతో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ త్వరలో శాంతి ఒప్పందానికి కనుక రాకపోతే ఈసారి ఇరాన్ అతి చెడ్డ సమయాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. కాగా, ఇరాన్‌పై తీవ్రస్థాయిలో దాడులు చేసేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తున్నదని, ఈసారి అధికారికంగా యుద్ధం పేరును ‘ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్’గా మార్చేందుకు యోచిస్తున్నదని ఒక మిలిటరీ ఉన్నత అధికారి తెలిపారు.
యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలకు సంబంధించి ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై అమెరికా ఐదు షరతులు విధించినట్టు ‘ఇరాన్ మీడియా’ తెలిపింది. అమెరికా నుంచి ఎలాంటి స్పష్టమైన రాయితీలు అందులో లేవని, చర్చల్లో ప్రతిష్ఠంభనకు దారితీస్తున్నదని ఇరాన్ నాయకత్వం పేర్కొన్నది. అమెరికా పంపిన షరతుల జాబితాను ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ విడుదల చేసింది. దీని ప్రకారం, ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో ఒక్కదానికి మాత్రమే ‘నిర్వహణ’కు అమెరికా అనుమతించింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలన్నీ అమెరికాకు స్వాధీనం చేయాలన్నది మరో షరతు. విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల్లో ‘కనీసం 25’ శాతం కూడా విడుదల చేయబోమని యూఎస్ తెలిపింది. ఇరాన్ యుద్ధ నష్టాలకు పరిహారం ఉండదని పేర్కొన్నది. చర్చలు ప్రారంభంతోనే.. అంతటా ఘర్షణలు ఆపాలన్నది అమెరికా విధించిన ఐదవ షరతు.