నాగర్ కర్నూల్ : ఫుడ్ పాయిజన్ ( Food poison ) ఆ పాఠశాల పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసింది. కళకళలాడిన పాఠశాల ఫుడ్ పాయిజన్ కారణంగా నిర్మానుష్యంగా మారింది. నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ గ్రామ శివారులో నెలకొల్పిన మహాత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyothibapule) బీసీ గురుకుల పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది.
ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే పాఠశాలలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు 743 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా శనివారం రాత్రి ఫుడ్ పాయిజన్ కారణంగా మూడు రోజుల్లో 400 మంది విద్యార్థులు ఖాళీ చేశారు. సగానికి పైగా విద్యార్థులు పాఠశాలను ఖాళీ చేయడంతో అధ్యాపక బృందం అయోమయంలో పడింది.
అస్వస్థతకు గురైన విద్యార్థులు చాలావరకు కోలుకున్నప్పటికీ వారిలో అభద్రతాభావం ఇంకా విడలేదు. పాఠశాలపై పూర్తిస్థాయిలో నమ్మకం కలిగే వరకు తమ పిల్లల్ని పంపించే స్థితిలో తల్లిదండ్రులు ధైర్యం చేయడం లేదు.