హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 22ఏ జాబితాను ప్రభుత్వమే సమగ్ర సర్వే జరిపి క్లియర్ చేయాలని, ప్రజలపై దరఖాస్తుల భారాన్ని మోపవద్దని సమితి అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల పొరపాట్ల వల్ల లక్షలాది మంది సొంత ఆస్తులు, పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేరాయని శ్రీహరిరావు తెలిపారు. ప్రభుత్వం చేసే పొరపాట్లకు ప్రజలు శిక్ష అనుభవించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అర్హత కలిగిన పట్టాభూములు, అనుమతులున్న ఇండ్లను ప్రభుత్వమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, బాధితులకు పూర్తి హకులు కల్పించాలని డిమాండ్ చేశారు.