ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 6 : పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్‌వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ – ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఉత్పత్తులను ఐఐసీటీలోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో వర్చువల్‌గా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమస్యలను ఎదుర్కొనడంలో విజ్ఞాన ఆధారిత పరిష్కారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిర్మూలించే ప్రయత్నాలలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పారు. ప్రపంచంలోని పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు సైన్స్, టెక్నాలజీ సామర్థ్యం ఎనలేనిదని పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని అన్నారు. గ్రీన్‌వర్క్స్ బయో ఉత్పత్తులు ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా మన సామూహిక పోరాటంలో ముందడుగని చెప్పారు. గ్రీన్‌వర్క్స్ బయో డైరెక్టర్ రిషికారెడ్డి మాట్లాడుతూ తమ ఉత్పత్తులు ప్రపంచ ప్లాస్టిక్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్ శిశిర్ సిన్హా, తెలంగాణ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, వీహబ్ సీఈవో సీతా పల్లచోల, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి, గ్రీన్‌వర్క్స్ బయో సలహాదారు డాక్టర్ సమీర్ జోషి తదితరులు పాల్గొన్నారు.