‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే..’ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన ఈ పంక్తులు నేడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కొంటున్న పరిస్థితికి సరిగ్గా సరిపోతాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడానికి శాయశక్తుల కృషిచేసి, సర్వశక్తులను కేటీఆర్ ఒడ్డారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఒక చిన్న ఉప ఎన్నికను అధికార పార్టీకి జీవన్మరణ సమస్యగా మార్చి, మోకాళ్ల మీద నిల్చోబెట్టడంలో కేటీఆర్ సఫలీకృతుడయ్యారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాలు, దౌర్జన్యాల వల్ల అనుకున్న విజయం దక్కలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్, ఈ సారి బాహాటంగానే కాంగ్రెస్ రిగ్గింగ్‌కు పాల్పడినట్టు పలు వీడియోల ద్వారా స్పష్టమవుతున్నా.. ఓటమిని హుందాగా ఒప్పుకొన్నారు. పైగా, ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. గెలిచి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ శ్రేణులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేస్తే అతని ఇంటికి వెళ్లి పరామర్శించి, జూబ్లీహిల్స్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోతుల్లోకి వెళ్తే.. ఏదైనా ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సర్వసాధారణం, సహజం కూడా. దాంతోపాటు ఎన్నడూలేని విధంగా ఒక ఉప ఎన్నిక కోసం రాష్ట్ర సీఎం కాలికి బలపం కట్టుకొని తిరిగారు. గెలిచిన రెండేండ్ల తర్వాత.. సరిగ్గా ఎన్నికలకు ముందు మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. కుల సంఘాలతో మీటింగ్‌లు పెట్టారు, ఇంకో మెట్టు దిగి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే పథకాలనే ఆపేస్తానని బెదిరించారు.
కాంగ్రెస్ నాయకులైతే దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కన్నీళ్లను అవమానించారు. ఆమెపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. వ్యక్తిత్వ హననానికి దిగారు. కుటుంబంలో చీలికలు తెచ్చారు, చివరికి గోపీనాథ్ కుమార్తెపై కేసు కూడా పెట్టారు. అయినప్పటికీ.. ఇవన్నీ తట్టుకొని, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ 38.13 శాతం ఓట్లు సాధించడం సాధారణ విషయం కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడొచ్చిన ఓట్ల శాతం కేవలం 5.8 తక్కువ. 2024 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అధికార పార్టీ సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించినప్పటికీ.. అధికారం కోల్పోయిన రెండేండ్లలో ఒక ప్రతిపక్ష పార్టీ ఇలాంటి ప్రదర్శన కనబరచడం చెప్పుకోదగ్గ అంశం. 38 శాతం ఓట్లు కాదు గదా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు నారాయణ్‌ఖేడ్, పాలేరు, హుజూర్‌నగర్‌లలో సైతం ఓటమి పాలైంది. నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవలేదు. హుజూరాబాద్‌లో అయితే 1.5 శాతం ఓట్లతో డిపాజిట్ కూడా కోల్పోయింది.
జూబ్లీహిల్స్ పోరులో స్థానికంగా కాస్త పేరున్న నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలాగోలా బయటపడింది. ఎన్నికలు జరిగిన తీరును నిశితంగా గమనిస్తే ఇది రేవంత్ గెలుపు కాదు, ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ మీద ఉన్న సానుభూతితో వచ్చిన గెలుపేనని అర్థమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఎంఐఎం అండతో, బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో బయటపడిన కాంగ్రెస్ పార్టీ గెలుపును చూసి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
ఎనిమిదేండ్ల కిందట ఏపీలో ఇటువంటి సన్నివేశమే ఆవిష్కృతమైంది. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికార టీడీపీ గెలిచింది. కానీ, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది.
మన దగ్గర జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతున్నదని పలు సర్వేలు స్పష్టం చేసినప్పటికీ చివరి రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పెట్టిన ప్రలోభాలు, చేసిన బెదిరింపులు, పాల్పడిన అక్రమాలు ఫలితాన్ని తారుమారు చేశాయి.
దేశవ్యాప్తంగా చతికిలపడుతూ బీహార్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌కు కాని, జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీకి కాని బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్స్సేనని జూబ్లీహిల్స్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 17 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్న బీఆర్ఎస్ గత 18 నెలల్లో వేగంగా పుంజుకున్నది. రైతులు, నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు, హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులు, ఇతర పీడితపక్షాల వైపున నిలబడుతూ.. వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రజాభిమానాన్ని తిరిగి గెలుచుకున్నది. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ సాధించిన 38.13 శాతం ఓట్లే ఇందుకు నిదర్శనం. ఇంకో మూడేండ్ల పాటు అధికారం ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిందే తప్ప, భవిష్యత్తు మాత్రం కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాలనపై నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం. కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తుచేసుకుంటున్న మాట నిజం.