ఒక చిలుక
దురాశతో తోటను వదిలి
బంగారు పంజరంలో ఇరుక్కుంది!
స్వీయ గొంతుకను మరిచి
నేర్పిన భాషనే వల్లె వేస్తున్నది
ఆకులు రాల్చుకున్న ఉద్యానవనం
చిగురిస్తుందనే జ్ఞానం లేక
పరాయి పంచన చేరింది!
రంగూ రూపూ మార్చుకొని
జోష్యం చెప్పేవాడికి
తన జీవితాన్ని రాసిస్తున్నది
కాలం చరిత్రలో
ఎన్ని పక్షులకు పరీక్ష పెట్టలేదు?!
విచారించవలసింది తోట కాదు
కాలుదనుకున్న పక్షిదే!
పరాయి పంచన
పంచభక్ష్య పరమాన్నాలు తిన్నా
అది ఇంటి భోజనంతో సమానం కాదు
వెలుగూ చీకట్లూ
ఒకచోటనే దాగుడుమూతలాడవు!
రాయి విసిరేవాళ్లకు తెలియదు
పండు రాల్చుకున్న చెట్టు దుఃఖం!!