ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నప్పటికీ ‘జాతీయ విద్యా విధానం-2020’ ద్వారా విద్యపై రాష్ర్టాలకున్న హక్కులను కేంద్రం హరించివేస్తున్నది. పీఎం శ్రీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలతో బలవంతంగా అవగాహన పత్రాలపై (మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్-ఎంఓయూ) సంతకాలు చేయిస్తున్నది. ఇందుకు తాజా నిదర్శనం కేరళ రాష్ట్రం. పీఎం శ్రీ పథకంలో చేరని రాష్ర్టాలకు సర్వశిక్షా అభియాన్ కింద రావాల్సిన నిధులను నిలిపివేస్తున్నది. తద్వారా రాష్ర్టాలను తన అదుపులోకి తెచ్చుకునే కుట్రలో భాగంగా కేరళకు రూ.1,486.13 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసింది.
దేశవ్యాప్తంగా 14,500 ఉన్నత పాఠశాలలను జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం అభివృద్ధి చేసి వాటిని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం ముఖ్య ఉద్దేశం. ఫలితంగా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. దేశంలో 3 లక్షల ఉన్నత పాఠశాలలు, 800 జిల్లాల్లో విస్తరించి ఉండగా కేవలం 14,500 పాఠశాలలను అభివృద్ధి చేయడమంటే సుమారు 2 లక్షల 85 వేల పాఠశాలల్లో చదివే 12 కోట్ల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను నిరాకరించడమే అవుతుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ లక్ష్యానికి విరుద్ధం. భారత సమాఖ్యస్ఫూర్తిని నిరాకరిస్తూ, విద్యలో కేంద్రం ఆధిపత్యాన్ని పెంచుతూ, రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక సమానత్వ హక్కులను, రాష్ర్టాల హక్కులను జాతీయ విద్యా విధానం ఉల్లంఘిస్తున్నది. ఇంత వివాదాస్పద జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్లో చర్చించకుండా, ఆమోదించకుండా అమలుచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరు ద్ధం. అందుకే బీజేపీయేతర రాష్ర్టాలు విద్యలో రాష్ర్టాల అధికారాలను తగ్గించే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
విద్యను కాషాయీకరణ చేయడమే కాకుండా ఫెడరలిజాన్ని దెబ్బతీసే లక్ష్యంతో పీఎం శ్రీ పథకాన్ని కేంద్రం అమలుచేస్తున్నదని కేరళ ప్రభు త్వం ఆరోపిస్తున్నది. గత మూడేండ్లుగా పీఎంశ్రీని కేరళ ఆమోదించకపోవడంతో రూ.1,486 కోట్ల నిధులను కేంద్రం తొక్కిపెట్టింది. పీఎం శ్రీ పథకంపై సంతకాలు చేయలేదనే కారణంతో 2023-24, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో కోట్ల రూపాయల నిధులను నిలిపివేసింది. 2027 మార్చితో ముగియనున్న ఈ పథకం ద్వారా మరో రూ.1,476 కోట్లు రావాలి. నిధుల నిలిపివేత నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2025 అక్టోబర్ 24న కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల మధ్య అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. దీంతో తక్షణమే రూ.971 కోట్ల నిధులు విడుదలవుతాయి. నిధుల నిలిపివేతతో కేరళలో 40 లక్షల మంది విద్యార్థులపై తక్షణ ప్రభావం పడుతున్నది. కేంద్రంతో ఎంవోయూపై సంతకాలు చేయగానే కేరళలోని పాలకపక్ష కూటమి పార్టీల మధ్య కొంత వివాదం చెలరేగింది.
పీఎం శ్రీ అమలు కోసం సంతకం చేయడమంటే జాతీయ విద్యా విధానాన్ని అంగీకరించినట్టు కాదని కేరళ విద్యామంత్రి వివరణ ఇస్తున్నారు. లౌకికవాదం, రాజ్యాంగ విలువల వంటి అంశాలపై రాజీపడకుండా, జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మార్చామని, కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానాన్ని 30 శాతాన్ని కూడా అమలుచేయలేదని కేరళ ప్రభుత్వం వివరిస్తున్నది.
మొన్న తమిళనాడు ప్రభుత్వానికి సర్వశిక్షా అభియాన్ నిధులను నిలిపివేసిన కేంద్రంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. బెంగాల్, కేరళ, తమిళనాడులో జాతీయ విద్యా విధానం కచ్చితంగా అమలుచేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయాలని ఏ రాష్ర్టాన్ని బలవంతం చేయలేరని ధర్మాసనం వెల్లడించింది. అయినా కేంద్రం వైఖరిలో మార్పు రాలేదు. ఇంతటి వివాదానికి కారణమైన జాతీయ విద్యావిధానం భారతదేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నదని, ప్రమాదకరమైన విద్య కాషాయీకరణ, కేంద్రీకరణ విధానాలు ముందుకుతెస్తోందని బీజేపీయేతర రాష్ర్టాలు, లౌకికవాదులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
జాతీయ విద్యావిధానం ద్వారా విద్యలో భారతీయ విలువల పేరుతో హిందుత్వ భావజాలాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని ప్రజాస్వామికవాదులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలో కేంద్ర ప్రభుత్వ జోక్యం పెరిగి ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుంది. విద్య ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ వల్ల ప్రభుత్వ విద్యారంగానికి నిధులు తగ్గి ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రోత్సాహం లభిస్తున్నది. దీనివల్ల విద్య ఖరీదై సామాన్య, పేద వర్గాలకు అందని పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది విద్య సార్వత్రీకరణ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. సమానత్వం, సమ్మిళితత్వంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందటంలో మరింత అంతరం పెరుగుతుంది. హిందీ మాట్లాడని రాష్ర్టాలపై ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలపై హిందీ భాషను రుద్దేందుకు త్రిభాషా సూత్రం దోహదపడుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. జాతీయ విద్యా విధానం నయా ఉదారవాద ఎజెండాగా విద్యా మార్కెట్‌ను సృష్టించే ప్రయత్నంగా కూడా చెప్పవచ్చు.
జాతీయ విద్యా విధానంతో భారత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం, తద్వారా విద్యార్థులను ప్రపంచ జ్ఞాన సమాజానికి అనుగుణంగా తయారుచేయడం అనేది అందరికీ కనిపించే లక్ష్యం. సమగ్ర మానవ వనరుల రూపకల్పన లక్ష్యంగా విద్య కేవలం అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానానికి పరిమితం కాకుండా, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక-నైతిక విలువలు వంటి ఉన్నతస్థాయి సామర్థ్యాలను పెంపొందించడం, భారతీయ విలువల ఆధారిత విద్య అంటే రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, దేశంపై అంకితభావం, భారతీయ సంస్కృతి, భాషలు, మూలాల పట్ల గర్వపడే తత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, నాణ్యమైన విద్య అందుబాటులోకి తేవడం, ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్థాయి వరకు విద్యను సార్వజనీనం చేయడం, డ్రాపౌట్లు తగ్గించడం వంటి ఉద్దేశాలు ఈ పథకంలో ఉన్నాయి. అయితే కనీసం ఐదో తరగతి వరకు సాధ్యమైతే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో బోధన చేయాలని సిఫారసు చేయడం, బట్టీ పద్ధతికి స్వస్తి చెప్పి, కేవలం పరీక్షల కోసం చదవడం కంటే భావనలను అర్థం చేసుకోవడంపై, అనుభవాత్మక అభ్యాసంపై దృష్టిపెట్టడం లక్ష్యంగా ఉన్నది.
పైకి గొప్ప లక్ష్యాలను జాతీయ విద్యా విధానం ప్రకటించినప్పటికీ ఆచరణ అంతా విద్యారంగ ప్రైవేటీకరణ దిశలో ఉంది. మోదీ ప్రభుత్వం గత పదకొండేండ్లలో విద్యారంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ వివరాలే ఇందుకు సాక్ష్యం! ఏ ఏటికాయేడు విద్యారంగ బడ్జెట్ కుంచించుకుపోవడంతో నిధుల కొరత సాకుతో ప్రైవేట్‌రంగం విస్తరించే విధానాలు ముందుకువస్తున్నాయి. అయితే విద్యపై ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయంగా కాకుండా అది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రక్రియగా చర్యలున్నాయి.
విద్యా నిర్మాణం మార్పులో భాగంగా పాత 10+2 విధానం స్థానంలో 5 + 3 + 3 + 4 పద్ధతిని తీసుకురావాలని కూడా జాతీయ విద్యా విధానం చెప్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్నది.
ఇప్పటికే పీఎం శ్రీ పథకం రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో ప్రారంభమైంది. పూర్వ ప్రాథమిక విద్య తరగతులు ప్రారంభం, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో అనుసంధానించడం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో పాత 10+2 విధానం స్థానంలో 5 + 3 + 3 + 4 విధానం అమలుకు పరోక్షంగా చర్యలు తీసుకుంటున్నది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్రం జాతీయ విద్యా విధానం అమలుకు చర్యలు తీసుకోవడం శోచనీయం. ఇది లౌకికవాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి, సమానత్వానికి వ్యతిరేకం కూడా!