హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ నేతల మధ్య వైరం రచ్చకెక్కుతున్నది. తొలినుంచీ కాంగ్రెస్ భావజాలంతో పనిచేస్తున్న నేతలకు, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు మధ్య అస్సలు పొసగడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుం చి పేరుకు ఇద్దరు మంత్రులున్నా.. ఓ సలహాదారే చక్రం తిప్పుతున్నాడని తెలుస్తున్నది. ఆ సలహాదారే మూడో మంత్రిగా కూడా చలాయిస్తున్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. ఏ ముఖ్యమైన పనికావాలన్నా ఈ సలహాదారు చెప్పాల్సిందేనని, ఏ అధికారికి పోస్టింగ్ ఇవ్వాలన్నా.. ఎవరికి పదవులు రావాలన్నా ఈయన అనుమతించాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారాయని వాపోతున్నారు. ఇక ఈ సలహాదారు సొంత నియోజకవర్గం ఎస్టీ రిజర్వు కావడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి మరీ ఘెరంగా తయారైనట్టు చెప్తున్నారు.
అక్కడ ఏ నియామకమైనా ఈయనే చేపడుతున్నారని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటక న్నా సలహాదారు మాటకే అధికారులు విలువ ఇస్తున్నారని తెలిసింది. ఇటీవల ఓ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిని, మరో నామినేటెడ్ పోస్టును కూడా లోకల్ ఎమ్మెల్యేకు చెప్పకుండానే సలహాదారు తనవాళ్లకు ఇప్పించుకున్నారు. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో కీలకమైన ఓ పోలీసు బాస్ పోస్టింగ్‌ను కూడా ఈ సలహాదారే వేయించారు. ఇటీవల కలెక్టర్ల బదిలీల్లోనూ ఈయన చెప్పినవారికే పోస్టింగ్‌లు వచ్చాయని అధికారులంతా చెప్పుకొంటున్నారు. రోజూ మంత్రుల ఇండ్ల ముందు ఉండే అధికారులు, ప్రజల క్యూకన్నా ఈ సలహాదారు ఇంటి వద్ద ఉండే క్యూనే అతి పెద్దగా ఉంటున్నదని చెప్తున్నారు. ఈయన హైదరాబా ద్ చుట్టుపక్కల భూ సెటిల్మెంట్లను ఓ ఎమ్మె ల్సీ, కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన ఓ నేతతో కల్సి చేస్తున్నారని తెలిసింది.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన కొంత మందినే ఈ సలహాదారు చేరదీస్తూ పాత కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నాడు కాంగ్రెస్‌లో తనకు సీనియర్లుగా ఉన్న ఓ ఇద్దరు-ముగ్గురు ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా జిల్లాలో చ క్రం తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. జిల్లాలో ఓ కీలక పోలీసు అధికారి.. ఈ సలహాదారు ఆశీస్సులతోనే పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆయన వచ్చిన నెలన్నర వరకు జిల్లాలోని కీలక మంత్రిని కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలువలేదని, చూసీచూసీ చివరికి ఆ మంత్రే ప్రత్యేకంగా పిలిస్తే వెళ్లి కలిసి వచ్చినట్టు తెలిసింది. ఓరుగల్లులో నేతల మధ్య పెరుగుతున్న అంతరంలో ఓ వర్గానికి ఈయన అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు.
ఒకరిద్దరు పాత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఈ హయాంలో తమకు పనులు కావాలంటే ‘సలహా’లు పాటించాల్సిందేనని, ఇక తప్పని పరిస్థితుల్లో సైకిల్ కాంగ్రెస్ వాళ్లతో కలిసి సాగాల్సి వస్తున్నదని వాపోతున్నారు. రాష్ట్రంలోని ముఖ్యనేత, ప్రధాన సలహాదారుతో ఉ న్న అవినాభావ సంబంధం నేపథ్యం లో ఒకరిద్దరు అసలు కాంగ్రెస్ నేతలు సలహాదారు ఏమి చెప్పినా కాదనకుండా చేస్తున్నారు. కొం డా మురళి వ్యాఖ్యలకు కూడా ఈ యనే కారణమని కాంగ్రెస్ వర్గాలు కోడైకూస్తున్నా యి. మురళి వ్యాఖ్యల నేపథ్యంలో సైకిల్ కాం గ్రెస్ నేతలు ఏకమయ్యారని కాంగ్రెస్ నే తలు చెప్తున్నారు. ఇక ఈ సలహాదారు ఇప్పుడు ఎ మ్మె ల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.